ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణించిన ఘటనలు ఎక్కువగానే చూశాం. జిమ్ చేస్తూ కానిస్టేబుల్, ఆడుకుంటూ ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలిక, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిండా 30 దాటని వారెందరో చనిపోయారు. తాజాగా ఓ బాలుడ్ని గుండె పోటు బలి తీసుకుంది
గుండెపోటుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా పోయింది. పుట్టిన పసి బిడ్డ నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని హార్ట్ ఎటాక్ వేధిస్తోంది. ముఖ్యంగా ఆనందకరమైన, విషాద సమయాల్లో పొట్టన బెట్టుకుంది. ఇటీవల కాలంలో తెలంగాణలో చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణించిన ఘటనలు చూశాం. జిమ్ చేస్తూ కానిస్టేబుల్, ఆడుకుంటూ ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలిక, సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఇలా నిండా 30 దాటని వారెందరో చనిపోయారు. తాజాగా ఓ బాలుడ్ని గుండె పోటు బలి తీసుకుంది. అదీ కూడా ఇంకాసేపట్లో పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటాడనగా బలి తీసుకుని ఆ ఇంట్లో విషాదం నింపింది.
ఈ హృదయవిదారక ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాబాపూర్‌కు చెందిన చునర్కార్ గుణవంత్‌రావు-లలిత దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు సచిన్(16) ఇటీవలే విడుదలైన పదోతరగతి ఫలితాల్లో మంచి మార్కులతో పాసయ్యాడు. అయితే కళాశాలలో చేర్పించేదుకు సిద్ధమౌతున్నారు. కాగా, శుక్రవారం పుట్టిన రోజు కావడంతో గురువారం కొత్త బట్టలు, కేక్ తీసుకునేందుకు ఆసిఫాబాద్ వెళ్లాడు. షాపింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అయితే గుండె పోటు లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు.
మార్గమధ్యంలోనే సచిన్ గుండె పోటుతో మరణించాడు. కొన్ని గంటల్లో పుట్టిన రోజు చేసుకోవాల్సిన కుమారుడు.. విగత జీవిగా కనిపించే సరికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే సచిన్ మరణించినా కూడా అతడికి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. అర్థరాత్రి 12 గంటలకు మృతదేహంతోనే కేక్ కట్ చేయించారు. సచిన్ చేతిని పట్టుకుని కేక్ కోయించారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. సచిన్ మృతదేహానికి శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.