రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఖాతాలో సుమారు 217 కోట్ల రూపాయలు జమ చేసింది. ఎందుకు.. ఎవరి ఖాతాలో అనే వివరాలు తెలియాలంటే.. ఇది చదవండి
తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై సిట్ విచారణ, ప్రభుత్వం, విపక్షాల పరోస్పర ఆరోపణలు చేసుకుంటూ.. పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ పరిణామాల సంగతి పక్కకు పెడితే.. ఉగాది ముందు తెలంగాణ మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఖాతాలో ఏకంగా 217 కోట్లు జమ చేసింది. మరి ఎవరి ఖాతాలో ఈ మొత్తం జమ చేసింది అంటే.. స్వయం సహాయక సంఘాల అకౌంట్‌లో. రాష్ట్రంలోని సుమారు రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల అకౌంట్‌లలోకి సోమవారం రూ.217 కోట్లు జమ చేసిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బ్యాంకులు గతంలో అధికంగా వసూలు చేసిన వడ్డీ సొమ్మును సైతం తిరిగి స్వయం సహాయక సంఘాల అకౌంట్‌లో జమ చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బ్యాంకులకు సరిగా డబ్బులు చేల్లిస్తున్న వారిలో స్వయం సహాయక సంఘాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రతి నెల క్రమం తప్పకుండ వీరు బ్యాంకులకు తాము తీసుకున్న లోన్‌కు సంబంధించిన డబ్బులను చెల్లిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. నమ్మకంగా రుణాలు చెల్లిస్తున్న వారికి.. అధిక మొత్తంలో లోన్ ఇస్తూనే.. ఇష్టారీతిన వడ్డీ వసూలు చేశారు. అయితే దీనిపై 2022 డిసెంబరు 23న జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు చర్చించారు. బ్యాంకులు ఒక్కో బ్రాంచిలో ఒక్కోలా వడ్డీ వసూలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని బ్యాంకులు ఈ నిబంధనను పట్టించుకోకుండా ఎక్కువ వడ్డీని వసూలు చేసినట్లు మంత్రి దృష్టికి వచ్చింది.
ఈ సమావేశం సందర్భంగా హరీశ్ రావు.. వడ్డీ వసూలుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. రూ.3 లక్షల వరకు రుణంపై గరిష్ఠంగా 7శాతం.. అలాగే రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణంపై 10 శాతం వసూలు చేయాలని మార్గదర్శకాలు ఇచ్చారు. బ్యాంకుల నిర్లక్ష్యంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అధిక వడ్డీ చెల్లించి నష్టపోతున్నారని తెలిపారు. ఏ బ్యాంకులోనైనా నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూలు చేస్తే ఆసొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో దర్యాప్తు చేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా 2,03,535 సంఘాల నుంచి రూ.217.61 కోట్ల మేర అధికంగా వడ్డీని వసూలు చేశారని తేలింది. దీంతో అదనంగా వసూలు చేసిన ఈమొత్తాన్ని ఆయా సంఘాల ఖాతాల్లోకి సోమవారం నాడు జమ చేశారు హరీశ్ రావు. ప్రభుత్వ నిర్ణయం వల్ల మొత్తం 2లక్షల సంఘాలకు లబ్ధి చేకూరింది.