శ్రీరామనవమి శోభ మొదలైంది. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా వేడుకలు మొదలయ్యాయి. ప్రతి ఏటా భద్రాచలం రామయ్యకు, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఒక చేనేత కళాకారుడు సీతమ్మ వారికి స్వహస్తాలతో చేసిన పీతాంబరం చీరను కానుకగా అందించారు. మరి ఈ చీర ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
దేవుడే మనిషి అవతారం ఎత్తి పురుషోత్తముడిగా జీవించి సమస్త మానవులకు ఆదర్శంగా నిలిచిన ఆ శ్రీరాముడు జన్మించిన రోజు శ్రీరామనవమి. 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత సతీసమేతంగా పట్టాభిషిక్తుడైన రోజు శ్రీరామనవమి. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ శ్రీరామనవమి రోజే జరిగింది. శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలు నవమి రోజునే జరిగాయి. శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా పర్వదిన శోభ మొదలైంది. ఈ క్రమంలో భక్తులు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ భద్రాచలం ఆలయంలోని సీతమ్మ వారికి పట్టు పీతాంబరం చీర కానుకగా అందించారు.
తెలంగాణ ప్రభుత్వం తరపున భద్రాద్రి సీతమ్మ వారికి పీతాంబరం చీరను అందించేందుకు సిద్ధమయ్యారు. 20 రోజుల పాటు శ్రమించి వెండి పట్టు పోగులతో ఈ పీతాంబరం చీరను మగ్గంపై నేసి మరీ రూపొందించారు. 750 గ్రాముల బరువున్న ఈ పీతాంబరం చీరను 150 గ్రాముల వెండి పోగులు, పట్టుదారంతో రూపొందించారు. పూర్తిగా చేనేత మగ్గంపైనే నేసి చీరను తయారుచేశారు. తమ జిల్లా నుంచి భద్రాచలం సీతమ్మ వారికి చీర కానుకగా అందించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరగా ఆయన స్పందించారు. ఆ పీతాంబరం చీరను అధికారులకు అందించాలని మంత్రి కేటీఆర్ సూచించడంతో హరిప్రసాద్ రాష్ట్ర సచివాలయ కార్యదర్శి భూపాల్ రెడ్డికి చీరను అందజేశారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ ను భూపాల్ రెడ్డి అభినందించారు. భద్రాద్రి సీతమ్మ వారికి పీతాంబరం చీరను కానుకగా పంపించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చేనేత కళాకారుడు హరిప్రసాద్ తెలిపారు. అమ్మవారికి కళ్యాణపు చీర తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి శ్రీ సీతారాములకు అందించే పట్టు వస్త్రాలు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అందించాలని హరిప్రసాద్ కోరారు. మరి తన స్వహస్తాలతో 20 రోజుల పాటు శ్రమించి భద్రాద్రి సీతమ్మ వారికి ప్రభుత్వం తరపున పీతాంబరం చీరను కానుకగా అందించిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.