చావు ఎప్పుడు.. ఎక్కడ నుంచి ఎలా వస్తుందో చెప్పడం కష్టం. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. చెట్టు కారణంగా చిన్నారి మృత్యువాత పడింది. ఎక్కడంటే..
కన్నుమూస్తే మరణం.. కన్ను తెరిస్తే.. జననం అన్నాడు ఓ మహాకవి. అవును మృత్యువు ఎప్పుడు ఎక్కడ నుంచి ఎలా వస్తుందో చెప్పడం కష్టం. ఈమధ్య కాలంలో చాలా మంది కార్డియాక్ అరెస్ట్ కారణంగా వయసుతో సంబంధం లేకుండా.. ఉన్నట్లుండి మృత్యువాత పడుతున్న ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. అంతసేపు సంతోషంగా గడిపిన వారు సెకన్ల వ్యవధిలో మృత్యువును కౌగిలించుకుంటున్నారు. ఇక తాజాగా ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. చెట్టు కారణంగా చిన్నారి మృత్యువాత పడింది. చెట్టంటే మనకు ప్రాణ వాయువు ఇస్తుందని తెలుసు కానీ ప్రాణాలు తీయడం ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త చదవండి.
ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన కన్నా సురేందర్, రజిత దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు సిద్ధు, కూతురు శ్రీజ (9). సురేందర్ గీత కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వేసవికాలం ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాత్రి సమయంలో కూడా ఇంట్లో ఉండే పరిస్థితులు లేవు. పట్టణాల్లో అయితే తప్పుదు కాబట్టి.. ఇళ్లలోనే ఉండాలి. కానీ ఊర్లలో రాత్రి సమయంలో చాలా మంది మాత్రం ఆరు బయట, మేడ మీద పడుకుంటారు. సురేందర్ కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉక్కపోతగా ఉంటుందని ఆరుబయట చెట్టు కింద నిద్రిస్తున్నారు. ఇక సురేందర్ ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఓ వేప చెట్టు ఉంది. దాని కొమ్మలు సురేందర్ ఇంటిపై వాలి ఉంటాయి.
ప్రతి రోజు మాదిరిగానే సోమవారం రాత్రి కూడా సురేందర్ కుటుంబ సభ్యులందరూ ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో ఈదురుగాలులు వీశాయి. ఈ ధాటికి చెట్టు కొమ్మ విరిగి మంచంపై నిద్రిస్తున్న సిద్ధూ, శ్రీజపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారి శ్రీజ తలకు బలమైన గాయమైంది. వెంటనే శ్రీజను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చిన్నారి మృతి చెందింది. కన్నబిడ్డ కళ్లముందే కన్ను మూయడంతో.. శ్రీజ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.