ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సదుపాయాల లేమీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల, బిల్లుల దందా. వీటితో విసుగుపోయిన సామాన్యుడు ఆర్ఎంపీ దగ్గరకు వెళుతున్నాడు. ఇదే అదునుగా చూసుకున్న ఆర్ఏంపీ డాక్టర్.. అరకొర జ్ఞానంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు.
వైద్యో నారాయణ హరి అన్నదీ సామెత. దేవుడి తర్వాత దేవుడిగా వైద్యులను పూజిస్తారు. కానీ నేడు వైద్యం కమర్షియల్ రంగులు పూసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన చికిత్స దొరక్క.. ప్రైవేటు ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. ఈ ఆసుపత్రులు మనిషి ప్రాణానికి విలువ కట్టి చెలగాటమాడుతున్నాయి. కన్సల్టెన్నీ ఫీజు కూడా ఈ రోజుల్లో 300 నుండి 500 రూపాయల వరకు పెరిగింది. ఇక సీరియస్ రోగమేదైనా వస్తే ఇక వారి సంగతి చెప్పనక్కర్లేదు. ఆస్తులు అమ్ముకోవాల్సిందే. దీంతో చిన్న రోగాలకు ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. వీరి దగ్గరికి వైద్యం కోసం వచ్చిన రోగుల పట్ల అరకొర జ్ఞానంతో చికిత్స అందిస్తున్నారు వీరు. ఇది వికటించి కొంత మంది అమాయకులు బలౌతున్నారు. తాజాగా తెలంగాణలో ఓ చిన్నారి వైద్యం వికటించి మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే..హన్మకొండ జిల్లాలోని మూమునూరు ఎంజెపీ గురుకుల పాఠశాలలో అవినాష్ అనే విద్యార్థి ఆరో తరగతి చదువుకుంటున్నాడు. ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం కడుపు నొప్పి వస్తుందని పాఠశాల నిర్వాహకులకు తెలిపాడు అవినాష్. దీంతో వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు పాఠశాల సిబ్బంది. వెంటనే అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడిని చికిత్స కోసం హసన్‌పర్తిలోని సముద్రాల శంకర్ అనే ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. చికిత్స అందిస్తున్న క్రమంలో డాక్టర్ కొన్ని ఇంజక్షన్స్ ఇచ్చాడు. ఆయన అవినాష్ తేరుకోలేదు.
విద్యార్థి పరిస్థితి మరింత విషమించడంతో మరోసారికి తీసుకెళ్లాలని ఆర్ఎంపీ వైద్యుడు సూచించాడు. వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా విద్యార్థి మృతి చెందాడు. అయితే డాక్టర్ శంకర్ చేసిన ట్రీట్మెంట్ వికటించడంతో తమ కొడుకు మృతి చెందాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న పిల్లవాడు.. చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. డాక్టర్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.