తెలంగాణలో పేపర్ లీకేజ్ ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేపర్ లీకేజ్ కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దయ్యింది. దాంతో ఎందరో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ యువతి తన గోడు వెళ్లబోసుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
విధి ఆ యువతిని చిన్న చూపు చూసింది. పుట్టుకతోనే చెవులు సరిగా వినబడవు.. దాంతో మాటలు కూడా సరిగా రావు. ఈ వైకల్యం కారణంగా బాల్యం నుంచి అనేక అవమానాలు ఎదుర్కొంది. ఎంతో కుంగిపోయింది. అయితే తల్లి ఆమెకు ధైర్యం చెప్పింది. ఈ రోజు నిన్ను చూసి నవ్విన వాళ్లే.. రేపు నీ ముందు తల దించుకునేలా జీవితంలో.. ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటూ ప్రొత్సాహించింది. తల్లి చూపిన ప్రేమ, ఇచ్చిన మద్దతుతో ఆ యువతి.. అవమానాలను పట్టించుకోకుండా జీవితంలో ముందుకు వెళ్లింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సరే.. చదువే తన భవిష్యత్తుకు బలమైన ఆధారం అని నమ్మింది. అవమానాలను పట్టించుకోకుండా.. కష్టాలను దాటుకుని.. బాగా చదువుకుని తన తల్లి మాటలను నిజం చేయాలనుకుంది.
అనుకున్నట్లే బాగా చదువుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవసాగింది. ఈ క్రమంలో తాజాగా టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యింది. కానీ పరీక్ష రద్దుతో.. ఆ యువతి జీవితం మళ్లీ మొదటికి వచ్చినట్లు అయ్యింది. ఉండటానికి ఇల్లు కూడా లేని తాను.. మళ్లీ పరీక్షకు మొదటి నుంచి సిద్ధం కావడం అంటే.. అది తన తలకు మించిన భారమని.. దాతలు ఆదుకోవాలని కోరుతోంది. ఆ వివరాలు..
సదరు యువతి పేరు భవాని. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శాంతి నగర్ కాలనీకి చెందిన మల్లయ్య, తిరుపతమ్మలకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె భవాని. ఆమెకు బాల్య నుంచి చెవుడు.. మాటలు సరిగా రావు. అయినా సరే పట్టుదలతో బాగా చదువుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెడీ అవుతోంది. ఈ క్రమంలో గ్రూప్-1 పరీక్ష రాసింది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యింది. కానీ పేపర్ లీకేజ్ కారణంగా.. పరీక్ష రద్దయ్యింది. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తాను.. మళ్లీ మొదటి నుంచి పరీక్షకు సిద్ధం కావాలంటే ఎంతో కష్టమని.. తనకు కనీసం ఇల్లు కూడా లేదని.. దాతలు ఎవరైనా తనను ఆదుకోవాలని.. తన కల నిజం చేసుకునేందుకు సాయం చేయాలని వేడుకుంటుంది. భవాని వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.