డబ్బుకు లోకం దాసోహం అంటారు.. ఈ మద్య కాలంలో డబ్బుకి ఇచ్చే విలువు మనుషులకు ఇవ్వడం లేదు. డబ్బు కోసం బంధాలు, బంధుత్వాలను కూడా లేక్కచేయడంలేదు. సొంతవాళ్లనే దారుణంగా మోసం చేస్తున్నారు.
ఈ మద్య కొంతమంది డబ్బు కోసం సొంతవాళ్లు అని కూడా చూడకుండా దారుణంగా మోసాలకు తెగబడుతున్నారు. మనం ఎక్కువగా ఎవరినైతే విశ్వసిస్తామో వారి వల్లే ఎక్కువగా నష్టపోతాము. మోసానికి ఎవ్వరూ అతీతులు కాదు. మోసానికి బందాలు, బంధుత్వాలు ఏవీ అడ్డురావు. మనం అనేక రకాల మోసాలు చూసి ఉంటాం. కానీ ఇక్కడ జరిగిన మోసం గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఓ మనవడు తన నానమ్మకు రైతు బంధు డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు తీసుకెల్లి అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇది తెలియని ఆ వృద్ధురాలు రైతుబంధు డబ్బులు ఇంకా రావడం లేదని ఆరా తీయగా జరిగిన మోసం బయటపడింది. అసలు ఏం జరిగింది? ఎందుకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం!
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ రెండు ఎకరాల్లో ఒక ఎకరం భూమిని గతంలోనే.. తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది. మిగిలిన ఇంకో ఎకరం భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అయితే.. ఆ వృద్ధురాలి ఎకరం పొలంపై తన కుమారుని కొడుకైనా రామేశ్వర్ కన్ను పడింది. నానమ్మ భూమిని ఎలాగైనా తన పేరు మీదికి మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు మనవడు. అనుకున్నదే తడవుగా ఓ పథకం రచించాడు. అయితే ఆ భూమికి కొన్ని కారణాల వల్ల రైతుబంధు రావడం లేదు. ఇదే అదునుగా బావించిన మనవడు నానమ్మ దగ్గరికి వెళ్లి రైతు బంధు డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీనికోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి కొన్ని సంతకాలు పెట్టాలని నచ్చజెప్పాడు. ఇది నమ్మిన నానమ్మ మనవడితో పాటు ఎంఆర్వో ఆఫీస్ కు వెళ్లి తను పెట్టమన్న చోటల్లా సంతకాలు చేసింది. ఇంకేముంది భూమి మనవడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది.
కొన్ని నెలలు గడిచిన తరువాత ఆ వృద్ధురాలు రైతు బంధు డబ్బులు ఇంకా రావడంలేదని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో నేరుగా ఎంఆర్వో కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకుంది. భూమిని మనవడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడనే నిజం బయటపడింది. జరిగిన మోసం తెలుసుకుని నివ్వెరపోయింది. సొంత మనవడు ఇంతటి మోసానికి ఒడిగట్టడంతో ఆమె ఆర్డీవోకు మొరపెట్టుకుంది. నిజ నిజాలు తెలుసుకున్న ఆర్డీవో కొడిమ్యాల తహశీల్దార్ కు ఫోన్ చేసి మొత్తం విషయాన్ని వివరించి, అట్టి భూమి రిజిస్ట్రేషన్ ను హోల్డ్ లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంతటి మోసానికి పాల్పడిన మనవడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.