సీఎం కేసీఆర్ ప్రతిష్ఠామకంగా చేపట్టిన ‘దళిత బంధు’ పథకం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి వేదికపై భారతరత్న అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రాం చిత్రపటాలకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పొందినా.. ప్రభుత్వ పథకాలు అన్నీ కొనసాగుతూనే ఉంటాయన్నారు. అందరికీ రేషన్ కార్డులు, నెల నెలా బియ్యం, పింఛన్లు కొనసాగుతాయ్. మీరు సంపాదించి గొప్పవాళ్లు అయ్యేదాకా పథకాలు అన్నీ కొనసాగుతాయని భరోసా ఇచ్చారు. దళిత బంధు డబ్బుతో నచ్చిన పని చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ చెప్పారు. దళిత బంధు నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చిని తెలిపారు.
వచ్చే ఏడాదికల్లా రూ.10 లక్షలు 20 లక్షలు అవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్డ్ అయిన వారికి కూడా దళిత బంధు వర్తింజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతు బంధు తరహాలో మొదట పేద దళితుల నుంచి మొదలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరికీ వర్తింపజేస్తామన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేకమైన కార్డు ఇస్తారని తెలిపారు. పాత ఖాతాలైతే.. బాకీలు పట్టుకుంటారన్నారు. ఏడాదికి లక్ష కన్నా విత్ డ్రా చేసుకోకూడదనే ఒక నిబంధన ఉన్నందున.. వాటిని అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకోవాలంటే అందరూ కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలని చెప్పారు. దానికి తెలంగాణ దళిత బంధు ఖాతా అనే పేరు పెడదామన్నారు. మేం ఇచ్చే కార్డు ద్వారా మీరు ఎక్కడెక్కడ ఏం పెట్టుబడి పెట్టారనేది జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారన్నారు.
దళిత బంధు వందశాతం సబ్సిడీతో ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, లైసెన్సింగ్ దుకాణాలు, ఎరువులు, మందుల దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. దళితులు కూడా పారిశ్రామిక వేత్తల్లాగా రాణిచాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దళిత బంధు దేశవ్యాప్తంగా సంచలనమవుతుందని.. అన్ని రాష్ట్రాలు చర్చించుకుంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రసంగాల మధ్యలో చలోక్తులు వేసే సీఎం కేసీఆర్ ఇవాళ శాలపల్లిలోనూ తనదైన శైలిలో ముచ్చటించారు. లబ్దిదారుగా ఎంపికైన కొత్తూరి రాధ కుటుంబానికి తొలి దళిత బంధు చెక్కు అందించారు. కొత్తూరి రాధను.. ఈ డబ్బుతో ఏం చేస్తారని అడగ్గా.. డెయిరీ ఫాం పెట్టుకుంటానని సమాధానమిచ్చింది. వెంటనే సీఎం కేసీఆర్ ఈసారి నేనొస్తే నాకు చాయ్ పోస్తవా మరి అని తమాషాగా మాట్లాడారు.