మీరు నిత్యం ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం సాగిస్తుంటారా..? అయితే మీకో గుడ్ న్యూస్. జంట నగరాల నుండి నగర శివారు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంఎంటీఎస్ సేవలను పెంచింది. మరియు ఉన్నవాటిని పొడిగించింది.
జంట నగరాలోని ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు శుభవార్త అందుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి నగర శివారు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంఎంటీఎస్ సేవలను పెంచింది. అదనపు సర్వీసులతో పాటు వాటి గమ్యస్థానాలను కూడా పొడిగించింది. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నూమా వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లను ఉందానగర్ వరకు పొడిగించగా, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లేందుకు 20 ఎంఎంటీఎస్ రైళ్లను అదనంగా కేటాయించింది. ఈ నిర్ణయంతో జంట నగరాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య 106కు చేరింది.
నగరంలో ఆర్టీసీ బస్సుల తర్వాత ఎంఎంటీఎస్‌లదే స్థానం. ఇంకా చెప్పాలంటే ఆర్టీసీ కంటే తక్కువ ఖర్చు ఉండే ఈ ప్రయాణానికి పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగించుకుంటారు. అయితే నగర పరిధిలోపే ఈ సేవలు ఉండటం కొందరిని ఇబ్బందులకు గురిచేసేది. ఈ క్రమంలోనే ఆ సేవలను మరింత సుదీర్ఘ దూరం పొడిగిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నూమా వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లను ఉందానగర్ వరకు పొడిగించింది. అలాగే, జంట నగరాల నుంచి మేడ్చల్‌కు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని.. ఈ మార్గంలో 20 అదనపు సర్వీసులు నడిపేందుకు సిద్ధమైంది. మల్కాజిగిరి, దయానంద్ నగర్, సఫిల్‌గూడ, రామకిష్టాపురం, అమ్ముగూడ, కావల్రీ బ్యారక్స్, అల్వాల్ బోలారం, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్‌ల సమీపంలోని ప్రయాణికులు ఈ సేవలు వినియోగించుకోగలరు.
47221, 47223, 47225, 47227, 47229, 47232, 47234, 47236, 47238, 47240 నంబర్లు కలిగిన 10 ఎంఎంటీఎస్ రైళ్లను సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లేందుకు కేటాయించగా, మేడ్చల్ నుంచి సికింద్రాబాద్‌కు చేరుకునేందుకు 47222, 47224, 47226, 47228, 47230, 47231, 47233, 47235, 47237, 47239, నెంబర్లు కలిగిన మరో 10 రైళ్లను కేటాయించారు. మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాక కూడా ఎంటీఎంటీఎస్ రైళ్లకు ఆదరణ ఏమాత్రం తగ్గటం లేదు. ధర తక్కువ కావడంతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎంఎంటీఎస్ రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.