హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. మ్యాన్ హోల్ లో పడి బాలిక మృతి చెందింది.
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 4వ తరగతి బాలిక బలైపోయింది. ఇవాళ ఉదయం భారీగా కురిసిన వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే వరద నీరు పోయేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్ హోల్ ని తెరిచి ఉంచారు. అది గమనించని చిన్నారి అందులో పడిపోయింది. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ లోని కళాసిగూడలో మౌనిక అనే అమ్మాయి 4వ తరగతి చదువుతోంది. ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. తగ్గిన తర్వాత పాల ప్యాకెట్ తీసుకురమ్మని మౌనికను తల్లిదండ్రులు షాపుకి పంపించారు. పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు బయలుదేరిన మౌనికను మ్యాన్ హోల్ మింగేసింది.
కళాసిగూడ వద్ద ఓ మ్యాన్ హోల్ లో పడి మౌనిక మృతి చెందింది. పాల ప్యాకెట్ కోసమని బయటకు వచ్చిన మౌనికకు మ్యాన్ హోల్ తెరిచి ఉందన్న విషయం తెలియలేదు. జీహెచ్ఎంసీ అధికారులు మ్యాన్ హోల్ మూతను తెరిచే ఉంచడంతో.. భారీ వర్షం కారణంగా రోడ్డు మీద వరద నీరు చేరింది. దీంతో రోడ్డు మునిగిపోయింది. మ్యాన్ హోల్ కనిపించకపోవడం, అది తెరిచి ఉన్న విషయాన్ని బాలిక గమనించలేకపోవడంతో అందులో పడి కొట్టుకుపోయింది. వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది రంగంలోకి దిగి పాప మృతదేహాన్ని వెతికారు. పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించిన డీఆర్ఎఫ్ సిబ్బంది బాలిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.