మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అంటూ ప్రముఖ కవి అందెశ్రీ అన్నట్లు రోజు రోజుకీ సమాజంలో మానవత్వం మంటగలిసిపోయే సంఘటనలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల జరుగుతున్న వివక్ష దారుణంగా ఉంటుంది.. కొంత మంది తమకు ఆడపిల్ల పుట్టిందని పసిగుడ్డును ముళ్లపొదల్లో, కాలువల్లో, చెత్త కుప్పల్లో పడవేసి చేతులు దులుపుకుంటున్న దారుణ ఘటనలు ఎన్నో మన కళ్ల ముందు జరుగుతున్నాయి. పెళ్లికి ముందే ప్రేమలో మునిగిపోయే యువతీ యువకులు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సంగారెడ్డిలో ఓ దారుణం జరిగింది.. అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువును ముళ్ల పొదల్లో పడవేసిన ఘటన అందరి హృదయాలను కలచి వేసింది. వివరాల్లోకి వెళితే..
న్యాల్కల్ మండలంలోని రుక్మాపూర్ కూడలి వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో పడవేసి వెళ్లిపోయారు. పొదల్లో నుంచి దీనంగా ఆ చిన్నారి అరుపులు విన్న గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శిశువును ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాపను ఎవరు ముళ్ల పొదలో పడవేసి వెళ్లారు అన్న విషయంపై పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు పోలీసులు.
ఆడ పిల్ల పుట్టిందని తల్లిదండ్రులు పసిగుడ్డు అని చూడకుండా కర్కశంగా ముళ్ల పొదలో పడవేసి పోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి ఆడ పిల్ల పుట్టిందని ఇలాంటి దుశ్చర్యకు పాల్పపడి ఉండవొచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైనా మానవత్వం మంటగలిసిన ఈ దారుణ ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తుంది. ఇలాంటి దారుణాలకు పాల్పపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.