రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అదీ కాకుండా మరో వారం రోజుల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో పిల్లలను కట్టడి చేయడం తల్లిదండ్రులకు తలకు మించిన పనే. అలా వారిని కట్టడి చేయాలంటే అందుకున్న ఏకైక మార్గం సమ్మర్ క్యాంపులు.
వేసవి కాలం మొదలయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అదీ కాకుండా మరో వారం రోజుల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో పిల్లలను కట్టడి చేయడం తల్లిదండ్రులకు తలకు మించిన పనే. అలా వారిని కట్టడి చేయాలంటే అందుకున్న ఏకైక మార్గం సమ్మర్ క్యాంపులు. చిన్నారుల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించడం, వారిని నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం జీహెచ్‌ఎంసీ ప్రతి ఏటా సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నది. ఈ ఏడాది ఈ నెల 25 నుంచి మే 31వ తేదీ వరకు 37 రోజుల పాటు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఓకే ప్రకటనలో తెలిపారు.
6 నుంచి 16 సంవత్సరాల చిన్నారులు ఇందుకు అర్హులు. అథ్లెటిక్స్, ఆర్చరి, బాల్ బాడ్మిటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుడ్ బాల్, జిమ్నాస్టిక్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కార్ఫ్ బాల్, మాల్ కంబా, నెట్ బాల్, రోలార్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, స్విమ్మింగ్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికైట్, థైక్వాండో, తగఫ్ వార్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెస్లింగ్ ఇండియన్, రెస్లింగ్ రోమన్, ఉషు, యోగా, త్రో బాల్, కిక్ బాక్సింగ్, మయ్ థాయ్, స్కే మార్షల్ ఆర్ట్స్, మినీ ఫుట్ బాల్, క్యారమ్స్ తదితర మొత్తం 44 రకాల ఆటలలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని మేయర్ కోరారు.
ఈ నెల 25న ఉదయం 8గంటలకు ఖైరతాబాద్ జోన్ లోని విక్టరీ ప్లే గ్రౌండ్ నందు సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభంకానుంది. ఆ తరువాత ఏప్రిల్ 26న సాయంత్రం 4 గంటలకు చార్మినార్ జోన్ లోని కులీకుతుబ్ షా స్టేడియం, ఏప్రిల్ 27న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ జోన్ లోని మారేడుపల్లి ప్లే గ్రౌండ్, ఏప్రిల్ 28న సాయంత్రం 4 గంటలకు కూకట్ పల్లి, శేరిలింగం పల్లి జోన్ లోని పి.జె.ఆర్ చందానగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం, ఏప్రిల్ 29న ఉదయం 8 గంటలకు ఎల్బీనగర్ జోన్ ఉప్పల్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా శిక్షణా సామాగ్రి సమకూర్చుకోవాల్సిందిగా.. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లను మేయర్ ఆదేశించారు. అలాగే, మే 15 నుండి 19వ తేదీ వరకు ఇంటర్ ఎస్.సి.సి టోర్నమెంట్ లో భాగంగా 16 రకాల గేమ్స్ ను నిర్వహించనున్నారు.