సాధారణంగా భగవంతుడిపై భక్తితో చాలా మంది అనేక పూజలు నిర్వహిస్తుంటారు. అంతేకాక తమ సామర్ధ్యం మేరకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇంకా కొందరు భగవంతుడిపై భక్తితో పాదయాత్రలు చేయడం, ఆలయాలకు వెళ్లి..మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి భక్తులందరికి భిన్నంగా ఓ మహాభక్తురాలు.. వినూత్నంగా తన భక్తిని చాటుకుంది. రాష్ట్రాలు దాటుకుంటూ ఆమె చేస్తోన్న యాత్ర..పూర్వ కాలం ఘోర తపస్సు చేసే మునులకు గుర్తు చేస్తుంది. ఆమె చేసే యాత్ర గురించి తెలిసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 కిలోమీటర్ల లక్ష్యంగా పొర్లు దండాలు పెడుతూ యాత్ర సాగిస్తోంది. 20 రోజుల క్రితం జహీరాబాద్ లో ప్రారంభమైన ఆమె యాత్ర ప్రస్తుతం కర్నాటకలో సాగుతోంది. అయితే అసలు ఆమె ఎవరు..యాత్ర చేయడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ధనుశ్రీ అనే గ్రామానికి చెందిన శశికళ అనే 55 ఏళ్ల మహిళకు దైవ భక్తి ఎక్కువ. చాలా ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి వచ్చి జహీరాబాద్ లో స్థిరపడ్డారు. ఆమెకు చిన్నతనం నుంచి భక్తిభావం ఎక్కువ. తన బాల్యం నుంచి కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని ఘట్టరాగి భాగమ్మ తల్లిని దర్శించుకుంటూ ఉండేది. ఆ అమ్మవారికి శశికళ పరమ భక్తురాలిగా మారిపోయింది. కరోనా నుంచి ప్రజలను కాపాడితే పొర్లుదండాలతో వచ్చి..మొక్కులు చెల్లించుకుంటానని కోరుకుంది. గత కొంతకాలం నుంచి కరోనా పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో..భాగమ్మ తల్లి మొక్కును తీర్చుకోవాలని శశికళ నిర్ణయించుకుంది. అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మొదట వాళ్లు సంకోచించినా.. ఆమె సంకల్పాని చూసి ఒప్పుకున్నారు.
దీంతో ఆమె నవంబరు 11న తన యాత్రను ప్రారంభించారు. జహీరాబాద్ లోని భవానీ ఆలయం నుంచి పొర్లుదండాల సేవను ప్రారంభించారు. జహీరాబాద్ నుంచి బీదర్, హుమ్నాబాద్, హల్లిఖేడ్, కమల్ పూర్ మీదుగా కర్ణాటకలోని కలబురగి నగరానికి చేరుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె చేస్తున్న యాత్రను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద ఎత్తున భక్తులు సైతం ఆమె వెంట నడుస్తున్నారు. యాత్ర మధ్యలో కొంచెం విరామం ఇస్తూ ఆమె..తన యాత్రను కొనసాగిస్తుంది. పట్టు విడవని సంకల్పం ఉంటే ప్రకృతే ముందుకు నడిపిస్తుందని ఈ భక్తురాలు మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ మహిళ యాత్ర ఘట్టరాగి భాగమ్మ తల్లి ఆలయానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరికొన్ని రోజుల్లో అమ్మవారి ఆలయాన్నికి చేరుకొనున్నారు. 300 కిలోమీటర్ల లక్ష్యంగా కొనసాగిన ఆ భక్తురాలి పొర్లు దండాల యాత్ర ఏ ఆటకం జరగకుండా దిగ్విజయంగా కొనసాగుతుంది.
ఈ యాత్రకు సంబంధించి అనేక విషయాలను ఆమె తెలియజేశారు. కరోనా కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోవడం తనని కలచివేసిందని ఆమె తెలిపింది. అందుకే కరోనా మహమ్మారిని తగ్గిస్తే పొర్లుదండాలు పెట్టుకుంటూ అమ్మవారి గుడి వస్తానని మొక్కుకున్నట్లు ఆమె తెలిపారు. అలానే ఇటీవల కరోనా పూర్తి స్థాయిలో తగ్గడంతో మొక్కును చెల్లించాలని భావించానని, ఈ క్రమంలోనే అమ్మవారు తన కలలోకి వచ్చి.. కరోనాను తగ్గించానని చెప్పిందని ఆ భక్తురాలు తెలిపింది. అందుకే దూరం ఎంత ఉన్న అమ్మవారే తనను ముందుకు నడిపిస్తుందనే బలంగా నమ్మి యాత్రను కొనసాగించినట్లు శశికళ తెలిపారు. తనతో పాటు పెద్ద ఎత్తున భక్తులు భజనలు చేస్తూ యాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.