ప్రజా గాయకుడుగా ఎనలేని కీర్తి ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్. ఇంజనీరింగ్ చదివినప్పటికి.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం కోసం ఆ జీవితాన్ని వదులుకున్నారు. పాటనే ఆయుధంగా చేసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. అలాంటి గద్దర్ పేరు వినిపించగానే మనకు.. మెడలో ఎర్ర కండువా, చేతిలో కర్ర, తెల్ల పంచా, నెరిసిన జుట్టుతో ఉన్న రూపే కళ్ల ముందు కదలాడుతుంది. ఇప్పటివరకు ఆయనను ఎప్పుడూ మోడ్రన్ దుస్తుల్లో చూడలేదు. తనదైన ప్రత్యేక ఆహార్యంతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న గద్దర్.. ఉన్నట్లుండి ఆయన అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు.
ధోతి, ఎర్ర కండువా వదిలి.. సూటు బూటు వేసుకుని గుర్తు పట్టలేని విధంగా లుక్ మార్చేశారు. సడెన్‌గా ఆయనను చూస్తే.. గద్దర్ అని పోల్చుకోవడం చాలా కష్టం. సూటూ.. బూటూ.. మెడలో టై మాత్రమే కాక జుట్టుకు కలర్ వేసుకుని..పూర్తి నలుపు రంగు జుట్టుతో ఉన్న గద్దర్ న్యూ లుక్ అందర్నీ ఆశ్చర్యానికి.. ఒకింత షాక్‌కు గురి చేసింది.
గద్దర్ ఈ న్యూలుక్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని.. కానీ, ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం పూర్తిగా ప్రజలదేనన్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులను చూస్తే ఆ దేవదేవుడే నడిచొచ్చి భక్తులను ఆహ్వానిస్తున్నాడా అనిపించిందన్నారు. తాను పాటలు రాసేటప్పుడు ప్రకృతితో పరవశించి పోయేవాడినని.. భగవంతుని సన్నిధిలో కూడా తనకు అంతే ప్రశాంతంగా అనిపించింది అని చెప్పుకొచ్చారు. ఇక గద్దర్ న్యూలుక్‌కి సంభంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.