నార్సింగి చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే ఈ ఘటన మొదటి నుంచి ఏం జరిగింది? పూర్తి అప్ డేట్స్ మీ కోసం.
హైదరాబాద్ లోని నార్సింగి శ్రీ చైతన్య కళాశాలకు చెందిన సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ తరగతి గదిలో రాత్రి పదిన్నర సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని సాత్విక్ తల్లిదండ్రులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్ధి సంఘాల నాయకులతో కలిసి ఆందోళన బాట చేపట్టారు. చైతన్య కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని నిరసన చేపట్టారు. దీంతో నార్సింగిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ ఫిబ్రవరి 28 మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో క్యాంపస్ హాస్టల్ నుంచి తరగతి గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. అప్పటికి సాత్విక్ కొన ఊపిరితో ఉన్నాడు. గమనించిన స్నేహితులు వార్డెన్ కి, సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వారు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు కాలేజ్ బయటకు వెళ్లి ఒక బైకర్ ని లిఫ్ట్ అడిగి సాత్విక్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సాత్విక్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులకు కనీసం కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. విద్యార్థులే సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు కాలేజీకి చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థులు, విద్యార్ధి సంఘాల నాయకులు కూడా కాలేజీ వద్ద నిరసన చేపట్టారు.
కాలేజీ యాజమాన్యం, లెక్చరర్ల ఒత్తిడి వల్లే సాత్విక్ చనిపోయాడని సాత్విక్ కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల పట్ల లెక్చరర్లు సైకోల్లా ప్రవర్తిస్తుంటారని, ఒక విద్యార్థినైతే రక్తం వచ్చేలా కొట్టారని.. ఆ రక్తం మరకలను తమతో శుభ్రం చేయించారని అన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. విద్యార్థులను కొడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. తమ స్నేహితుడు చనిపోయాడని విద్యార్థులు, కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
చదువుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారని, సరిగా చదవకపోతే కొడుతున్నారని, బూతులు తిడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్టాఫ్ ఒత్తిడి, టార్చర్ చేయడం వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని సాత్విక్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే బాధ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అయితే నార్సింగి కాలేజీ బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటివరకూ తమకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి కాలేజీ తరపున ఎవరూ రాలేదని ఆరోపిస్తున్నారు. చదువుల పేరుతో పిల్లల్ని చంపేస్తారా అని మండిపడుతున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టేది పిల్లల చావులు చూడడానికా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటి?