గొత్తికోయల చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస రావు ఉదంతం అందరినీ కలిచివేసిసంగతి తెలిసిందే. పోడుభూముల విషయంపై గొత్తికోయలతో జరిగిన మాటామంతీ కాస్తా ఆయన హత్యకు దారితీసింది. ఆ విషాదం ఇంకా రాష్ట్ర ప్రజల మనసుల్లోంచి చెరిగిపోలేదు. ఆయన కుటుంబం ఇంకా తేరుకోనేలేదు. కానీ తండ్రి చనిపోయిన నాలుగో రోజునే ఆయన కూతురు క్రితిక క్రీడా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అంతేకాకుండా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి.. తండ్రికి తగిన తనయ అని నిరూపించుకుంది.
ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు ఈ నెల 22న గొత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. కుటుంబ పెద్ద కోల్పోతే కుటుంబ సభ్యులు ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇంత బాధలో ఉన్న ఆయన కుమార్తె కృతిక (10).. క్రీడల్లో తన ప్రతిభ చూపి తండ్రికి తగిన తనయ అని నిరూపించుకుంది. శుక్రవారం కొత్తగూడెంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు క్రితిక.. బంధువుల సాయంతో హాజరైంది. అండర్-10 విభాగంలో లాంగ్‌జంప్‌లో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది. దీంతో డిసెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా చిన్నారి మనోస్థైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. కృతిక ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల సర్వే కొనసాగుతుంది. పోడు భూముల విషయంలో చాలా కాలంగా ఉన్న వివాదాలకు పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జండాల పాడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు వేసిన ప్లాంటేషన్ ను తొలగించి గుత్తికోయలు పోడు వ్యవసాయం చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై గుత్తికోయలు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన ప్రాణాలు కోల్పోయారు.