ఒకప్పుడు నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. నగరంలో పర్యటించటానికి వచ్చిన వాళ్లు కచ్చితంగా ఈ బస్సుల్లో ప్రయాణించేవారు. ఈ ప్రయాణం ఎంతో సరదాగా ఉండేది. వారి జీవితాల్లో బాగా గుర్తుండిపోయేది.
నగరంలో ఎన్ని బస్సులున్నా డబుల్ డెక్కర్ బస్సులకున్న క్రేజ్ వేరు. హైదరాబాద్లో ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు నడిచేవి. నగరవాసులు డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించి ఎంతో సంతోషపడేవారు. కొంతకాలం తర్వాత ఈ బస్సులు కనిపించకుండాపోయాయి. గత కొన్నేళ్లనుంచి ఇప్పుడున్న బస్సులు నగరంలో తిరగటం మొదలైంది. అయితే, మంత్రి కేటీఆర్ నగరపౌరుల కోరిక మేరకు నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తన హామీని నెరవేర్చి బస్సులను నగరంలోకి రప్పించారు. దీనికి రూ.12 కోట్లు వెచ్చించి 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను హెచ్‌ఎమ్‌డీఏ సహకారంతో హైదరాబాద్ నగరంలో మళ్లీ ప్రారంభించారు.
ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫ్రీ జర్నీకి కూడా అవకాశం కల్పించారు. గత రెండు నెలల నుంచి ఫ్రీగా నగరంలో ఈ బస్సులు తిప్పుతున్నా ఆదరణ లేదు. అందుకు హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు స్పెషల్ గా రూట్ మ్యాప్ ను రూపొందించారు. ఈ బస్సులను నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ లో రెండు నెలల నుండి తిప్పుతున్నా.. ఈ బస్సులను ఏ రూట్లలో నడుపుతున్నారో ప్రజలకు తెలియపోవడంతో అనుకున్నంత మేరకు ఆదరణ లభించలేదు. ఈ బస్సులు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నడిపిస్తున్నారు. దీంతో హెచ్‌డీఎమ్‌ఏ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ తయారు చేసింది.
ట్యాంక్ బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీద్, తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, ఐటీ కారిడార్.. వంటి ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులు నడపనున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర నుండి మొదలై ఈ రూట్లను తిరుగుతూ మళ్లీ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటాయి. సంజీవయ్య పార్క్, ఖైరతాబాద్ ఎస్టీపీ వద్ద ఛార్జింగ్ పాయింట్లను ఏర్పరచినట్లు హెచ్‌డీఎమ్‌ఏ కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ బస్సులలో టికెట్ లేకుండానే ప్రయాణం చేయొచ్చు. పర్యాటకుల ఆసక్తిని, స్పందనను బట్టి ఛార్జ్ విధించే అవకాశం ఉంది. మరికొన్ని రూట్లను కూడా పర్యాటకుల రిక్వెస్ట్ మేరకు ఎంపిక చేయనున్నారు.