గత కొన్ని రోజులుగా ప్రయాణికులకు షాక్‌ల మీద షాకులు ఇస్తోన్న హైదారబాద్ మెట్రో.. నేడు మాత్రం శుభవార్త చెప్పింది. మెట్రో స్టేషన్‌లో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే అది ఒక్క స్టేషన్‌లో మాత్రమే. ఎక్కడ అంటే
హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక.. నగరంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునవారికి బాగా కలసి వచ్చింది. ధర తక్కువ మాత్రమే కాక ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా.. త్వరగా గమ్యం చేరి పోవచ్చు. పైగా ఏసీ జర్నీ. దాంతో నగరంలో మెట్రోల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక గత కొన్ని రోజులుగా వరుసగా ప్రయాణికులకు షాకులిస్తోన్న మెట్రో.. తాజాగా ఓ శుభవార్త చెప్పింది. మెట్రో స్టేషన్‌లో ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం కల్పించనుంది. అయితే ఇది అన్ని మెట్రో స్టేషన్‌లలో కాదు. కేవలం ఒక్క స్టేషన్‌లో మాత్రమే. మరి ఇంతకు ఏ స్టేషన్‌లో ఈ ఉచిత వైద్య సేవలు లభించనున్నాయి అంటే..
అమీర్‌పేటలోని ఇంటర్ ఛేంజ్ మెట్రో స్టేషన్‌లో ఈ ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫ్రీ వైద్య సేవలు అందనున్నాయి. ఆస్టర్ ప్రైమ్ హస్పిటల్ శుక్రవారం అమీర్‌పేటలోని ఇంటర్ ఛేంజ్ మెట్రో స్టేషన్‌లో ఈ ఉచిత వైద్య సేవలు ప్రారంభించింది. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఉపాధ్యక్షుడు, సీవోవో సుధీర్ చిప్లుంకర్, ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ అండ్ వెండర్ డెవలప్‌మెంట్ ఏజీఎం సంజయ్ పులిపాక తదితరులు పాల్గొన్నారు.
మెట్రో స్టేషన్‌లోని సి లెవెల్ ఎంట్రీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ద్వారా ప్రయాణికులతోపాటు అవసరమైన వారికి అత్యవసర వైద్య సేవలు ఉచితంగా అందజేయనున్నట్లు ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి యూనిట్ హెడ్ డా.కల్యాణ్ మురమళ్ల తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఈ ఉచిత వైద్య సేవలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెట్రోస్టేషన్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అయితే ప్రస్తుతానికి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో మాత్రమే సేవలు అందుతుండగా.. త్వరలోనే మిగతా స్టేషన్లలోనూ ఉచిత వైద్య సేవలు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవల హైదరాబాద్ మెట్రో స్మార్ట్‌కార్డులు, క్యూఆర్ టికెట్లపై డిస్కౌంట్‌ను ఎత్తేసిన సంగతి తెలిసిందే. ఆ టికెట్లుపై ఉన్న 10 శాతం డిస్కౌంట్ ఆఫర్‌లో ఏఫ్రిల్ 1 నుంచి మార్పులు చేశారు. పూర్తి ఛార్జీని వసూలు చేస్తున్నారు. వీటికి తోడు మెట్రో మాల్స్‌లో పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు కూడా మెట్రో అధికారులు రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెట్రో నిర్వహిస్తున్న మాల్స్‌లో ఫ్రీ పార్కింగ్ సౌకర్యం ఉండగా.. త్వరలోనే దాన్ని ఎత్తేసి.. పెయిడ్ పార్కింగ్ తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే.. ప్రయాణికులపై మరింత భారం పడనుంది.