బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజుల నుంచి బాధ పడుతున్న మాజీ ఎంపీ జంగా రెడ్డి… నిన్న అర్ధ రాత్రి మరణించినట్లు సమాచారం అందుతోంది. రాత్రి ఒక్క సారిగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డారు మాజీ ఎంపీ జంగా రెడ్డి. ఈ తరుణంలోనే.. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లాలో చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. ప్రస్తుతం హన్మకొండలో నివాసం వుంటున్నారు. సుదేష్మాను 1953లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమారైలు సంతానం.
1984లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీల్లో జంగారెడ్డి ఒకరు. అప్పట్లో హనుమకొండ పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై 54 వేలపై చిలుకు మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఈ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయినా జంగారెడ్డి విజయం సాధించారు. జంగారెడ్డి మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం బీజేపీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.