సాధారణంగా జూన్ నెల రాగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, వర్షం కురవడం సహజం. అయితే.. కొన్నిసార్లు సాధారణ వర్షంతో పాటు వడగళ్లు కురుస్తుంటాయి. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం అటవీ ప్రాంతంలో ఆదివారం కురిసిన వర్షం ధాటికి అనూహ్య రీతిలో చేపలు కొట్టుకొచ్చాయి. అందులోనూ అవి భయంకరమైన ఆకారంలో ఉన్నాయని స్థానికులు చెపుతున్నారు. చూడడానికి నల్లగా.. ఒళ్లంతా ముళ్ళు ఉన్నట్లుగా ఉన్నాయని చెప్తున్నారు.
ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు పడిదం చెరువు సమీపంలో, అటవీ ప్రాంతం సమీపంలో ఈ చేపలు కనిపించాయని తెలిపారు. ఇవి చేపల వర్షం కురవడం వల్లే ఇక్కడికొచ్చాయని చెబుతున్నారు. అధిక బరువున్న చేపలను కొందరు పట్టుకొని కుంటల్లో, బావుల్లో నిల్వ చేశారు. అయితే.. ఇదే తరహాలో గత నెల 21న కూడా వర్షం కురవడం గమనార్హం.
ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖ అధికారి మాట్లాడుతూ.. సముద్ర తీర ప్రాంతాల్లో సుడిగాలి వచ్చిన సమయంలో నీటితో పాటు చేపలు పైకి లేచి మేఘంగా మారి వర్షంతో పాటు పడతాయని చెప్పారు. కాళేశ్వరంలో చేపల వర్షం కురిసిందని చెప్పలేమన్నారు. ఈ చేపలను వాడుక భాషలో నటు గురక అని, శాస్త్రీయ నామం అనాబస్ టెస్ట్‌ట్యూడియస్ అంటారని, ఇవి చిన్నపాటి నీళ్ల ధార ఉన్నా పాకుకుంటూ నేలపైకి వస్తాయని చెప్పారు.
ఆకాశం నుంచి చేపలు పడడం వెనుక మిస్టరీ ఏంటి?
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. ఆకాశం నుంచి పడే చేపలు.. నిజంగా ఆకాశం నుంచి పడవంట. వాతావరణంలోని మార్పుల వల్ల అక్కడక్కడ టోర్నడోలు ఏర్పడతాయి. ఈ టోర్నడోలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి నీటిపై ప్రయాణించే సమయంలో ఆ నీటిని అపరమితమైన శక్తితో పైకి లాగుతాయి. చేపలు, కప్పలు వంటి సముద్ర జీవులు కూడా టోర్నడోలతో పాటుగా పైకి ప్రయాణిస్తాయి. కొంత దూరం ప్రయాణించాక ఈ టోర్నడోలు బలహీనమవుతాయి. అప్పుడు చేపలు, వర్షంతో కలిసి కిందికి పడతాయి. దీన్నే చేపల వర్షం అని ప్రజలు అంటుంటారు అని చెపుతున్నారు. కాగా టోర్నడోలు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంతే తప్ప ఆకాశంలో చేపలు ఉండటం, అవి వర్తంతో పాటు పడటం జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: దారి మధ్యలో ఆగిపోయిన అంబులెన్స్.. గాల్లో కలిసిన యువతి ప్రాణాలు