హైదరాబాద్- కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్ ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ లో సోమవారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రి యాజమాన్యం అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. రోగులను హుటాహుటిన ఇతర ఆస్పత్రులకు తరలించారు. 5 ఫైరింజన్ లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. రోగులను తరలించడానికి 20 అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు. స్థానికుల సాయంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సెక్యూరిటీ గార్డులు సమయస్ఫూర్తితో సాహసోపేతంగా అందరి ప్రాణాలు కాపాడారు.