తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారు జామున ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఉడ్ వర్క్ జరుగుతున్న ప్రదేశంలో షార్ట్ సర్క్యూట్ అవ్వగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటల కారణంగా సెక్రటేరియట్ మొత్తం పొగతో నిండుకుపోయింది. ఇది గమనించిన సెక్రటేరియట్ సిబ్బంది వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన కొత్త సెక్రటేరియట్ దగ్గరకు చేరుకున్నారు.
దాదాపు 11 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటల్ని ఆర్పేశాయి. అయితే, సెక్రటేరియట్ భవనంలోని ఏ ప్రదేశంలో అగ్ని ప్రమాదం జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు. సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్‌ను అధికారులు మూసేశారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ కొత్త సెక్రటేరియట్ భనవం మొత్తం 28 ఎకరాల్లో ఉంది. ఇందులో మొత్తం ఏడు అంతస్తులు ఉన్నాయి. మొత్తం నాలుగు గేట్లు ఉండగా.. లుంబినీ పార్క్‌కు ఎదురుగా ప్రధానం ద్వారం ఉంది. సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఈ ద్వారం గుండా సెక్రటేరియట్ లోపలికి వెళుతుంది.
ఎన్టీఆర్ గార్డెన్‌కు ఎదురుగా ఉన్న గేట్ ద్వారా ఉద్యోగులు.. బిర్లామందిర్ వైపు ఉన్న గేటు నుంచి సామాన్యులు లోపలికి వెళ్లనున్నారు. ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త సెక్రటేరియట్ భవనం ప్రారంభం కానుంది. ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ కొత్త సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించి తన ఛాంబర్‌లోకి ప్రవేశించనున్నారు. మరి, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.