మే నెలలో వచ్చే ఎండలకు బండరాళ్లు సైతం పగిలిపోతాయని అంటారు. ఎండల ప్రభావంతో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
మే నెలలో ఎండలు దంచికొడుతున్నాయి. మొదటి వారం పలు చోట్ల వర్షాలు పడినా.. గత రెండు వారాల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటిపోతుంది. ఎండలకు ప్రజలు బయటకు రావడం మానివేశారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని వాతావారణ శాఖ హెచ్చరిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మద్య హైదరాబాద్ లో పలు చోట్ల వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ హైటెక్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ హైటెక్ సిటిలో సైబర్ టవర్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆఫీస్ లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఫార్చూన్ టవర్స్ 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయం పై ఇంకా తెలియాల్సి ఉంది.