తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ వంటి ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు నగరంలో మరో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో వరుసగా అగ్ని ప్రమాదాలు కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ప్రజలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్ ఘటన, అత్తాపూర్‌లో కట్టెల గోదాంలో, లింగం పల్లి, శాస్త్రీపురం వంటి చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. స్వప్ప లోక్ కాంప్లెక్స్ ఘటన కూడా ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందిన సంగతి విదితమే. ఇవన్నీ మర్చిపోక ముందే నగరంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. రోజుకో అగ్ని ప్రమాద ఘటనలతో నగర వాసులు బెంబేలెత్తుతున్నారు.
స్వప్ప కాంప్లెక్స్ ఘటన జరిగి పెను విపత్తును మిగిల్చింది. ఇంకా ఆ సంగతి మర్చిపోక ముందు మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ రసాయన పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. భారీగా మంటలు, పొగ రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురై.. ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.