నగరంలో నివసిస్తున్నారా..? అయితే కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు..?, ఎక్కడ..? ఎలాంటి ప్రమాదాలు చొటుచేసుకుంటాయో అంతుపట్టడం లేదు. వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు మానవాళిని సజీవ దహనం చేస్తున్నాయి.
నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా లేకున్నాయి. గతంలో రాంగోపాల్ పేట డెక్కన్ స్టోర్, స్వప్న లోక్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ టింబర్ డిపోలలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదాలు మారణహోమం సృష్టించాయి. మంటల్లో చిక్కుకొని అగ్నికి ఆహుతయ్యారు. ఈ విషాద ఘటనలు మరవకముందే నగరంలో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి సహా దంపతులు సజీవదహనం అయ్యారు.
మొదట టింబర్ డిపోలో అంటుకున్న మంటలు పక్కనున్న భవనానికి వ్యాపించాయి. దీంతో అందులో నివాసముంటున్న దంపతులు సహ వారి చిన్నకుమారుడు మృతిచెందారు. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ(28), జోషిత్(5)గా గుర్తించారు. మరో చిన్నారి ఆచూకీ తెలియలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో చిన్నారి ఏమయ్యాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలావుంటే గతేడాది మార్చి నుండి ఇప్పటివరకు నగరంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాల్లో 32 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 2022, మార్చి 23న బోయిగూడ పరిధిలోని తుక్కు గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 2022 సెప్టెంబర్ 12న సికింద్రాబాద్, రూబీ లాడ్జి అగ్ని ప్రమాదంలో మరో 8 మంది మృతి చెందారు. ఆపై ఈ ఏడాది జనవరి 29న సికింద్రాబాద్ డెక్కన్ మాల్ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఇక ఇటీవలసికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరో ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. జనావాసాల మద్య వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడమే అగ్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టానికి కారణమవుతోంది.