బీఆర్‌ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చటంతో అది కాస్తా గుడిసెపై పడి లోపల ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా .. పది మందికి పైనే తీవ్రంగా గాయపడ్డారు. కొందరి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి.
ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ సంబరాల సదర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచా అపశృతికి దారి తీసింది. బాణసంచా కారణంగా గుడిసెలో రాజుకున్న నిప్పు ఓ వ్యక్తి ప్రాణం తీయగా.. పదికి పైగా మందిని తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆత్మీయ సమ్మేళనంలో విషాదానికి కారణం ఏంటి? ఈ తప్పు ఎవరిది?
బుధవారం ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గంలోని చీమలపాడులో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. వీరంతా సభ జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటున్న నేపథ్యంలో కార్యకర్తలు స్వాగతం పలకటానికి పూనుకున్నారు. ముందుగా అనుకున్నట్లుగానే తెచ్చి పెట్టుకున్న బాణ సంచాను పేల్చటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ తారాజువ్వ ఎగిరి పక్కనే ఉన్న పూరి గుడిసెపై పడింది. తారాజువ్వ రాజేసిన నిప్పు కారణంగా గడిసె అంటుకుంది. ఆ వెంటనే లోపల ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి చనిపోగా దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిలో పోలీసులు, జర్నలిస్టులు, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వీరిలో కొంతమంది కాళ్లు, చేతులు తెగి, ఎగిరిపడటం అక్కడి వారిని కలిచివేసింది. ఇక, ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాధారణంగా ఏదైనా వేడుక జరిగినపుడు బాణసంచా కాల్చటం పరిపాటి. కానీ, బాణ సంచా కారణంగా ఎలాంటి ప్రమాదం జరగవొచ్చో ఓ అంచనా ముందుగానే ఉండాలి. ముఖ్యంగా జనావాసాల్లో ఉన్నపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బీఆర్‌ఎస్ కార్యకర్తలు పక్కన పూరి గడిసె ఉందని తెలిసినా బాణసంచా పేల్చటం ఇక్కడ ప్రమాదానికి ప్రధాన కారణమైంది. పోలీసులు కూడా గుడిసె ఉన్న చోట బాణ సంచా పేల్చటానికి అనుమతి ఇవ్వటం.. ఒకవేళ అనుమతి ఇచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం పదికి పైగా మంది కుటుంబాల్లో విషాదాన్ని తెచ్చింది. ఇది కావాలని చేసినది కాకపోయినా.. బీఆర్‌ఎస్ కార్యకర్తల నిర్లక్ష్యం.. పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే ఈ తప్పు జరిగిందని నెటిజన్లు మండిపడుతున్నారు. మరి, ఈ దారుణ సంఘటనకు కారణం ఎవరని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.