సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బస్‌కు ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంగణం అంతా దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే డిపో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గంటసేపు శ్రమించి మంటలను అదుపు చేశారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ 2019లో 40 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. వీటిని మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోలకు కేటాయించారు. మియాపూర్ డిపో బస్సులు బీహెచ్‌ఈఎల్ నుంచి, కంటోన్మెంట్ డిపో బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. శబ్ధ, వాయు కాలుష్యం లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం సాగించే ఈ బస్సులకు నగరంలో మంచి డిమాండ్ ఉంది. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుకు ఛార్జింగ్ పెడుతుండగా ఈ ఘటన జరిగినట్లు చెప్తున్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్లు మిగతా బస్సులను అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంలో కాలిపోయిన బస్సు విలువ 3 కోట్ల రూపాయలు ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.