నగరంలో వరుస అగ్నిప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేట డెక్కన్ స్పోర్ట్ ఉదంతం మరవకముందే మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని మారేడుపల్లి ప్రాంతంలో ఉన్న శ్రీలా హిల్స్ అపార్ట్‌మెంట్‌లో మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడకి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 3 ఫైరింజన్లతో మంటలు అదుపు చేస్తున్నప్పటికీ.. మంటలు అదుపులోకి రావట్లేదన్నది అందుతున్న సమాచారం.
కాగా, కొన్నిరోజుల క్రితం సికింద్రాబాద్‌లోని డెక్కన్ స్పోర్ట్ మాల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లతంతైనప్పటికీ.. ఒక్కరి అస్థిపంజరం మాత్రమే వెలుగులోకి వచ్చింది. నగరంలో ఇలా వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడానికి కారణం.. నిబంధనల ఉల్లంఘించడమే. అగ్నిమాపక శాఖ నివేదించిన ప్రాథమిక నివేదికలో సైతం ఇదే వెల్లడైంది. ఈ భవనంలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలింది. భవనానికి రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు అయిదు అంతస్తులు ఉన్నా సరైన నిర్వహణ సామర్థ్యం లేకపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు వెల్లడించారు.
అంతేకాదు.. భవనం లోపలి వైపు సరైన వెలుతురు లేకపోవడం, భవన బేస్‌మెంట్‌ను సైతం వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం ప్రమాద తీవ్రతను పెంచింది. ఈ కారణంగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో లోపలికి ప్రవేశించలేకపోయారు. సిబ్బంది ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ ధరించి భవనం పై అంతస్తు నుంచి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఇలా ఒక్కటేమిటీ.. నగరంలో ఎక్కడచూసినా ఇలా నిబంధనలు తుంగలో తొక్కిన బిల్డింగ్ లే దర్శనమిస్తున్నాయి. నగరంలో వరుస అగ్నిప్రమాదాలు చోటుకుంటుండడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.