వరుస అగ్ని ప్రమాదాలతో భాగ్యనగరం.. భయంతో వణికిపోతుంది. కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద సంఘటనను మర్చిపోకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీఎస్‌టీలోని అన్నపూర్ణ బార్ సమీపంలోని ఓ గోదాంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో.. దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దాంతో జనాలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. గోడౌన్ సమీపంలోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
ఇక అన్నపూర్ణ బార్ వెనక ఉన్న గోదాంలో మంటలు చెలరేగాయి. అక్కడ నుంచి పక్కనే ఉన్న మరో గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న వెంటనే చిక్కడపల్లి పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేక వేరే కారణం ఏమైనా ఉందా అని విచారిస్తున్నారు. దీని గురించి గోదాం నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.