తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీక్ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ సంచలనం సృష్టించగా.. తాజాగా పదో తరగతి పేపర్లు లీక్ అవ్వడం సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం అర్థరాత్రి ఉన్నట్లుండి సడెన్‌గా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎలాంటి కారణం చెప్పకుండా ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా సంజయ్‌ను అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇక బండి సంజయ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించే విషయంలో కూడా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత ఆయనను బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భువనగిరి మేజిస్ట్రేట్ నివాసంలో ఆయనను హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ ప్రస్తుతం బండి సంజయ్ కాన్వాయ్ భువనగిరి దాటి ఆలేరు వైపు వెళ్తునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు బండి సంజయ్‌ను ఎక్కడుకు తీసుకెళ్తున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంది. ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీసింది.
వరంగల్ సీపీ రంగనాథ్.. బండి సంజయ్ అరెస్ట్‌ను ధృవీకరించారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉందని తెలిపారు. వాటి ఆధారంగానే బండి సంజయ్‌పై మొత్తం 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు రంగనాథ్ వెల్లడించారు. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్‌ప్రాక్టీస్, సీఆర్‌పీసీ 154, 157 సెక్షన్ల కింద.. బండి సంజయ్ మీద కేసులు నమోదు చేశారు. అంతేకాక చాలా పకడ్బందీగా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. బండి సంజయ్ అరెస్ట్‌కు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందు వెల్లడిస్తామని తెలిపారు.
మంగళవారం అర్థరాత్రి 12 గంటల తరువాత కరీంనగర్‌లో బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ముందు అసలు బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు.. ఏ కారణం చేత అరెస్ట్ చేశారు ఏ సెక్షన్లు నమోదు చేశారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులోనే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు మొదటి నుంచీ ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని సీపీ రంగనాథ్ ధృవీకరించారు. ప్రశ్నపత్రం లీక్ కేసులోనే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
మంగళవారం కమలాపూర్ నియోజకవర్గంలో పరీక్ష జరుగుతుండగానే పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు రావడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు బూరం ప్రశాంత్. అతడు బీజేపీ నేతలకు సన్నిహితుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి అనుచరుడు, ఆ పార్టీలో కీలక కార్యకర్త. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూరం ప్రశాంత్ ఓ విద్యార్థి ద్వారా కమలాపూర్ నియోజకవర్గం ఉప్పల్‌లోని ప్రభుత్వ స్కూల్ పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్న పత్రాన్ని బయటికి తెప్పించాడు. ఆ తర్వాత ఉదయం 10:46 గంటల నుంచి వాట్సాప్ గ్రూపులకు షేర్ చేశాడు. ఆ తర్వాత పేపర్ లీక్ అయ్యిందని స్వయంగా బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్త రాసి వరంగల్ మీడియా గ్రూపుల్లో వేశాడు. అంతేకాక హైదరాబాద్‌లోని పలువురు బ్యూరో ఇన్‌చార్జిలకు సైతం బ్రేకింగ్ న్యూస్ అంటూ పంపించాడు.
ఇక ఉదయం 11:10 గంటలకు ప్రశాంత్ స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి వాట్సాప్‌లో హిందీ పేపర్‌ను పంపించాడు. ప్రశ్నపత్రం తన చేతికి వచ్చిన తర్వాత రెండుగంటల వ్యవధిలో ప్రశాంత్ ఏకంగా 142 ఫోన్ కాల్స్ మాట్లాడాడు. పేపర్ లీకైనట్టు వార్తలు ప్రసారం చేయాలని మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పాడు. ఇక ఈ కేసులో ప్రశాంత్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో తాజాగా బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.