ఆడపిల్లలు ఏం సాధిస్తారు అనే కంటే ముందు సాధిస్తారో లేదో ముందు పరీక్ష పెట్టాలి కదా. కానీ ఆ పరీక్ష పెట్టకుండానే ఏమీ సాధించరు అని స్టాంప్ వేసి వదిలేస్తే ఎలా? ఒక తండ్రి తనకు ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారని.. వీళ్ళేం సాధిస్తారు అని అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు వారు ఊరే గర్వించేలా సాధించారు.
సమాజం ఇంత అభివృద్ధి చెందుతున్నా.. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్న.. మహారాణుల్లా అన్ని రంగాలను ఏలుతున్నా.. ఇంకా కొన్ని చోట్ల కొందరి రాతి మనుషుల్లో ఆడపిల్లలంటే వివక్ష ఉంది. ఆడపిల్ల పుట్టిందా? ఇక ఏం సాధిస్తుంది అని చిన్న చూపు చూడడం.. ఆడపిల్ల పుట్టిందని వదిలేసి పోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు మనకి తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. అయితే కవల ఆడపిల్లలు పుడితే మురిసిపోయి ముద్దు పెట్టుకుంటాడనుకుంటే.. ఆ కసాయి తండ్రి దూరం పెట్టాడు. ఆ పిల్లలు ఈరోజు ఘనత సాధిస్తేనే గానీ ఈ సంఘటన ప్రపంచానికి తెలియదు. 16 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఆ కవల ఆడపిల్లలు సాధిస్తేనే గానీ తెలియలేదు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో చోటు చేసుకుంది.
శర్వాణి, ప్రజ్ఞాని ఇద్దరూ కవల పిల్లలు. వీరి తల్లి కవిత పెద్దపల్లి కలెక్టరేట్ లో అవుట్ సోర్సింగ్ లో ఎలక్ట్రానిక్స్ జిల్లా మేనేజర్ గా పని చేస్తున్నారు. 2007లో కవిత ఏడో నెల కడుపుతో ఉండడంతో డెలివరీ కోసం ఆమె భర్త పుట్టింటికి పంపించాడు. అయితే ఆమెకు కవల ఆడపిల్లలు పుట్టారు. దీంతో ఆమె భర్త ఆడపిల్లలిద్దరినీ పుట్టింట్లోనే వదిలేశాడు. అప్పటి నుంచి వారి ఆలనాపాలనా అమ్మమ్మ వనజ, తాతయ్య వీరేశం చూసుకుంటున్నారు. శర్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకూ ప్రైవేట్ పాఠశాలలో చదువుకోగా.. 6వ తరగతి నుంచి మోడల్ స్కూల్ లో చదివారు. బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఇద్దరూ 10 జీపీఏ సాధించారు. అమ్మమ్మ, తాతయ్య, స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి ప్రోత్సాహంతోనే తాము 10 జీపీఏ సాధించామని శర్వాణి, ప్రజ్ఞాని వెల్లడించారు.
ఏం సాధిస్తారులే అని వదిలేసిన తండ్రికి సమాధానమే ఈ కవల ఆడపిల్లలు. ఇంకా మును ముందు ఎన్నో సాధిస్తారు అనడానికి నిదర్శనమే ఈ కవల ఆడపిల్లలు సాధించిన ఘనత. టెన్త్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించినట్టే జీవితంలో కూడా ఎన్నో విజయాలను సాధించాలని కోరుకుందాం. పసి వయసులో తండ్రి ప్రేమ కరువైతే ఆ పిల్లలు ఎంత బాధపడతారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ పిల్లల అమ్మమ్మ, తాతయ్యలు మాత్రం ఆ లోటు లేకుండా పెంచారు. పెంచడమే కాదు, ఆడపిల్లలు ఏం సాధిస్తారులే అనుకున్న తండ్రికి.. వారు తలచుకుంటే ఏమైనా సాధించగలరు అనేలా ఆడపిల్లలిద్దరినీ తీర్చిదిద్దారు. అందుకు వీరికి ఒక సెల్యూట్ చేయాల్సిందే. పిల్లలు సాధించిన తర్వాత, సంపాదించిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా గర్వపడతారు.. కానీ పిల్లలు ఏదో సాధిస్తారని నమ్మిన తల్లిదండ్రులకే ఒక రేంజ్ ఉంటుంది. పిల్లల్ని కనడం కంటే వారు కన్న కలలను, వారి ప్రతిభను గుర్తించడం గొప్ప. మరి దీనిపై మీరేమంటారు.