జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ప్రైవేట్ బస్సు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లారీ, ప్రైవేట్ బస్సు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ వారి కుటుంబంలో ఇటీవల మరణించిన ఓ వృద్ధురాలి అస్తికలను గోదావరిలో కలిపేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
సిద్దిపేట జిల్లాలోని బెజ్‌గాం గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇటీవల ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అందరూ ఆమె అస్థికలను గోదావరి నదిలో కలపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో 25 మంది కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు కొత్తపేట వద్దకు చేరుకోగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయిపోయింది. డ్రైవర్ బస్సులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం.. జేసీబీ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మిగతా వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.