పొలంలో ఉండాల్సిన రైతన్న రోడ్డు మీదకు వచ్చాడు. తనకు జరిగిన అన్యాయానికి ఏం చేయాలో తెలియక రాజధానికి బయలుదేరాడు. భుజాన నాగలి, చేతిలో ఉరితాడు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు.
పొలంలో ఉండాల్సిన నాగలిని భుజాన ఎత్తుకున్నాడో రైతన్న. వ్యవసాయం చేయాల్సిన అన్నదాత.. చేతిలో ఉరితాడు పట్టుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపాడు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు అర్ధనగ్నంగా నడుచుకుంటూ నిరసన వ్యక్తం చేశాడు. ఎవరా రైతు, ఎందుకిలా చేశాడని అనుకుంటున్నారా? వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలం, పోనకల్ గ్రామానికి చెందిన సురేందర్ అనే అన్నదాత.. తన భూమిని స్థానిక రాజకీయ నేతలు తప్పుడు పత్రాలు సృష్టించి కాజేరని ఆరోపించాడు. తన భూమిని తన తమ్ముడికి పట్టా చేశారన్నాడు. జరిగిన అన్యాయం గురించి స్థానిక పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోయిందన్నాడు.
వాళ్లు సృష్టించినవి సరైన డాక్యుమెంట్లు అయితే తనను హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రజలందరూ చూస్తూ ఉండగా ఉరితీయాలంటూ ధైర్యంగా చెప్పాడు సురేందర్. తన సొంత తమ్ముడితో పలుమార్లు భూతగాదాలు పెట్టించి, కర్రలతో దాడి చేయించారని చెప్పుకొచ్చాడు. హత్య చేయించేందుకు కుట్ర పన్నిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సురేందర్ విజ్ఞప్తి చేశాడు. ఈ విషయంలో గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర డీజీపీ జోక్యం చేసుకోవాలని కోరాడు. రైతన్న తన భుజానికి వేసుకున్న నాగలికి కట్టిన ఫ్లెక్సీ అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఆ ఫ్లెక్సీలో న్యాయం కోసం లంచం ఇవ్వలేనని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుండటం గమనార్హం. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.