హీరోలకు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయడం చూసి ఉంటారు. కానీ పోలీసులకు పాలాభిషేకం చేయడం అనేది చాలా అరుదు. కానీ రైతు దంపతులు ఒక పోలీస్ అధికారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏ తప్పూ చేయకపోయినా కూడా పోలీసులంటే ప్రజలు భయపడే పరిస్థితి. అయితే తెలంగాణ పోలీసుల విషయంలో మాత్రం పోలీసులు ప్రజల విషయంలో ఫ్రెండ్లీగా ఉంటారు. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంభిస్తున్నారు. దీంతో పోలీసుల మీద ప్రజలకు గౌరవం ఏర్పడింది. సాధారణంగా పోలీసులను ప్రజలు మెచ్చుకోవడం, గౌరవించడం అనేది పెద్దగా కనబడదు. ఎక్కువగా తిట్టుకునే వారే ఉంటారు. కానీ కొంతమంది పోలీసుల తీరుకి ప్రజలు ఇంప్రెస్ అయిపోయి వాళ్ళని అభిమానిస్తుంటారు. సినిమాల్లో హీరో పోలీస్ అయితే ప్రజలు సెల్యూట్ చేస్తారు. ప్రజలను వేధించే విలన్స్ ని కొడుతుంటే ఆ పోలీస్ పాత్రలో ఉన్న హీరోని చూసి సినిమాలో ఉన్న ప్రజలు చప్పట్లు కొడితే.. సినిమా చూసే ప్రేక్షకులు విజిల్స్ వేస్తుంటారు.
అయితే నిజ జీవితంలో ఇలా హీరోయిజం చూపించే పోలీసులు ఉంటారా? ఉంటే మాత్రం ఆ పోలీసులకు హీరోలకు చేసినట్టు పాలాభిషేకం చేస్తారా? అంటే దానికి సమాధానమే ఈ ఘటన. ఒక పోలీస్ ఆఫీసర్ వల్ల తమకు న్యాయం జరిగిందని కృతజ్ఞతగా రైతు దంపతులు సదరు పోలీస్ అధికారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. నర్సంపేటకు చెందిన నాడెం వీరాస్వామి, రాజ్యలక్ష్మి దంపతులకు నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉంది. అయితే ఏనుగుల తండాకు చెందిన ఎస్బీఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్ కు 2018లో 20 గుంటల భూమిని విక్రయించారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.
అయితే గతంలో 20 గుంటల భూమి కొన్నవారు ఇప్పుడు వచ్చి మరో 10 గుంటల భూమి అమ్మాలంటూ రైతు దంపతులపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. ఆ భూమే మాకు జీవనోపాధి అని భూమిని అమ్మేది లేదని చెప్పారు. దీంతో అనిల్ నాయక్, సునీల్ నాయక్ లు కొంతమందితో కలిసి రైతు దంపతులను బెదిరించడం మొదలుపెట్టారు. పొలాన్ని ధ్వంసం చేసి సరిహద్దు రాళ్లు తొలగించారు. అధికారుల అండతో రైతు దంపతులపై దౌర్జన్యానికి దిగారు. అంతటితో ఆగకుండా తిరిగి రైతు దంపతులపై అట్రాసిటీ కేసు పెట్టారు. దీంతో విసిగిపోయిన రైతు దంపతులు విషయాన్ని వరంగల్ కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన వెంటనే స్పందించి.. విచారణ జరిపి తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారని, పోలీసులు విచారణ జరిపి బెదిరింపులకు పాల్పడిన 11 మందిపై కేసులు నమోదు చేశారని రైతు దంపతులు వెల్లడించారు. భూమినే నమ్ముకుని బతికే తమకు సీపీ రంగనాథ్ సార్ న్యాయం చేశారని.. అందుకే ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞత తెలుపుకుంటున్నామని వీరాస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఈయన చిత్రపటానికి కు కొందరు పాలాభిషేకం చేశారు. తాజాగా ఇప్పుడు రైతు దంపతులు చేశారు. రాజకీయ నాయకులు, హీరోల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయడం మామూలే కానీ ఇలా పోలీసులకు పాలాభిషేకాలు చేయడం అనేది గొప్ప విషయమే. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.