కోతులు వాటి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొంత కాలంగా తెలంగాణలో చేతికొచ్చిన పంటలను, పండ్ల తోటలను కోతులు నాశనం చేస్తున్నాయని, కోతుల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోతుల నియంత్రణకు ఫ్యామిలీ ప్లానింగ్అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కోతుల కుటుంబ నియంత్రణకు జిల్లాల వారీగా కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల కోతులు ఉన్నట్టు అంచనా వేస్తున్నామని, ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రులు చెప్పారు. చేతికొచ్చిన పంటలు కోతుల పాలవుతుంటే రైతులు మనోవేదనకు గురవుతున్నారని మంత్రులు ఆవేదన వ్యక్తం చేసారు. కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపించాలని, గతంలో సీఎం చంద్రశేఖర్ రావు ఇదే అంశంపై దిశానిర్దేశం చేసారని మంత్రులు గుర్తు చేసారు. ఇక కోతుల నియంత్రణకు చట్టపరిధిలో ఉండే ఇతర అవకాశాలను పరిశీలించాలని, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రులు భావించారు.
ఇది చదవండి : క్యాన్సర్ చికిత్స పొందుతూ ఫోటోషూట్ చేసిన స్టార్ హీరోయిన్!
కోతుల బెడద నివారించాలంటే కోతుల గణన, వాటి వల్ల రైతులకు జరుగుతున్న నష్టం అంచనా వేయాలని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 8 మంది అధికారుల కమిటీతో మంత్రులు భేటీ కానున్నారని తెలిపారు. రాష్ట్రంలో కోతుల నియంత్రణకు గతంలోనే కమిటీ ఏర్పాటు చేశామని, ఇప్పటికే పలు అంశాలపై అధ్యయనం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో కోతుల బెడద నివారణ కమిటీ కన్వీనర్ రఘునందన్ రావు, పీసీసీఎఫ్(సోషల్ ఫారేస్ట్రీ)ఆర్.యం. దొబ్రియాల్, సీఎఫ్ హైదరాబాద్ ఎం.జే అక్బర్, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.