మాజీ మంత్రి, హుజురాబాద్ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రకటించారు. కేసీఆర్ ను గద్దె దించితేనే రాష్ట్రానికి పట్టిన శని పోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం, పోడు భూముల రైతుల సమస్యలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బెంగాల్ తరహాలో రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించాలంటూ ఈటల రాష్ట్ర ప్రజలను కోరారు. బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ లో ఎలాగైతే మమతా బెనర్జీని సువెందు అధికారి ఓడించాడో.. అలాగే తెలంగాణలో సీఎం కేసీఆర్ పై గజ్వేల్ స్థానంలో తాను విజయం సాధిస్తానంటూ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా గజ్వేల్ లో పోటీ చేసే విషయంపై ఇప్పటికే అధిష్ఠానానికి తెలియజేసినట్లు వెల్లడించారు. గతంలో సిద్దిపేట స్థానం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్, 2018లో మాత్రం గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే హుజూరాబాద్ లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల మాత్రం ఈసారి గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేస్తానంటున్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేస్తాననడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.