కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ ఎస్ యూ ఐ) తెలంగాణ అధ్యక్షుడు, కాంగ్రెస్ యువనాయకుడు బల్మూరి వెంకట్‌ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు గురువారం అర్దరాత్రి అదపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై గాడిద దొంగతనంతో పాటు దాన్ని శారీరకంగా హింసించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి హుజురాబాద్‌లో వెంకట్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బల్మూరి వెంకట్ అరెస్ట్ ఘటనపై కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయనపై జమ్మికుంట పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిరసన చేపట్టిన బల్మూరి వెంకట్ గాడిదను దొంగతనం చేసి హింసించారని తమకు ఫిర్యాదు అందిందని.. ఆ మేరకే కేసు నమోదు చేశామని డీసీపీ స్పష్టం చేశారు. ఆ గాడిదను ఎక్కడినుంచి తెచ్చారు?.. యజమాని ఎవరు? అనే వివరాలను వెంకట్ చెప్పడం లేదని తెలిపారు. సాధు జంతువైన గాడిద బడుగు బలహీన వర్గాలకు, సంచార జాతులకు ఆసరా ఇస్తుందని.. అలాంటి జంతువును దొంగతనం చేసి స్వప్రయోజనాల కోసం హింసించడాం నేరమని డీసీపీ వివరించారు. వెంకట్‌పై ఐటీ, యానిమల్స్ యాక్ట్‌లతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.
కాంగ్రెస్ నేతల ధర్నా
బల్మూరి వెంకట్‌ని గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. కేసీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ.. వెంకట్‌ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న హుజురాబాద్ ఏసీపీ కోట వెంకటరెడ్డి జమ్మికుంట స్టేషన్ కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు.