గాడిద అనే ఓ తిట్టు కింద చూస్తాం. లేదంటే పని పాట చేయకుండా ఖాళీగా తిరుగుతున్నవారిని గాడిదలు కాస్తున్నావా అని అంటాం. కానీ ఓ వ్యక్తి నిజంగా గాడిదలు కాస్తూనే లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. గాడిద పాలతో వ్యాపారం చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.
నేడు పంటలేకేదీ కాదూ అనర్హం అని కొంత మంది రైతులు నిరూపిస్తున్నారు. అసాధ్యం అనుకున్న పంటలు వేసి సుసాధ్యం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని చూస్తున్నారు. కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను వదిలేసి కూడా రైతుగా మారుతున్న కథనాలు అనేకం చూశాం. అలాగే పాడి రైతులు ఈ దారిలోనే వెళుతున్నారు. దేశవాళీ జాతికి చెందిన గేదెలు, ఆవులు, మేకలతో పాటు అధిక పాలను దిగుబడినిచ్చే పశువులను పెంచుతూ.. ఆ పాలతో ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పుడు మరో జంతువు పాలతో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు తెలంగాణలోని నాగూర్ కర్నూల్‌కు చెందిన ఓ వ్యక్తి.
గాడిద ఈ పేరు వింటే ఓ తిట్టు. లేదా ఓ రకమైన చులకన భావం. ఖాళీగా ఉంటూ ఏ పని చేయకపోతే గాడిదలు కాస్తున్నావా అని, గాడిదకు ఏమీ తెలుసు గంధపు చెక్కల వాసన అంటూ హేళన చేస్తుంటాం. కానీ ఈ గాడిద వల్ల ఓ వ్యక్తి నెలకు లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం బెలిగొండకు చెందిన పులిదండ నగేష్.. జీవనోపాధి కోసం పలు పనులు కలిసి రాకపోవడంతో గాడిద పెంపకం వ్యాపారం వైపు మళ్లాడు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఇప్పుడే గాడిద పాలకు డిమాండ్ పెరగడంతో దీన్ని వ్యాపారంగా మలుచుకోవాలని భావించాడు నగేష్. సౌందర్య సాధనాలతో పాటు ఆరోగ్యం చేకూరుతుందని తెలుసుకున్న నగేష్, అతని కుమారుడు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు.
కోటిన్నర పెట్టుబడితో 110 గాడిదలను కొనుగోలు చేసి.. వాటి నుండి పాలను తీసి అమ్ముతున్నారు. ఈ పాల ద్వారా నెలకు రూ. 6 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు నగేష్ తెలిపారు. తెలంగాణలో తమదే మొదటి ఫామ్ అని చెప్పారు. గాడిదల పెంపకమంటే అంత ఆషామాషీ కాదూ.. గాడిదలో రకాలు, ఆహారం, ఎంత పాలు ఇస్తాయని తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం నుండి శిక్షణ తీసుకున్నాడు. గాడిద పాలను అమ్మేందుకు తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం గాడిదలు కొనుగోలు చేశాడు. ఆరు ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. వాటి ఆహారం కోసం మరి పది ఎకరాలు లీజుకు తీసుకున్నాడు.పాలను తీసి శీతల యంత్రాల్లో నిల్వ ఉంచుతారు. వీటిని 15 రోజులకొకసారి తమిళనాడు సంస్థ తీసుకెళుతుంది. నెలకు 9 లక్షల ఆదాయం రాగా, రూ. 3 లక్షలు నిర్వహణ, ఇతర ఖర్చులు అవుతున్నాయని నగేష్ తెలిపారు.