కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవటానికి ఇష్టపడుతూ ముందుకొస్తున్నారు. కంటికి కనిపించని ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు పండు ముసలి నుంచి యుక్త వయసు వరకు ప్రతీ ఒక్కరు వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ వ్యాక్సిన్ డోసులు వేయించుకుంటున్నారు. ఇక వ్యాక్సిన్ వేయించుకుని అది ఏదో గొప్ప చేశామన్నట్లుగా ఫోటో దిగటం, ఆ తర్వాత స్టేటస్ లు పెట్టడం ప్రతీ ఒక్కరికి ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ఇలా ఫోటో ఫోజులో పడి వైద్యులు తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలికి ఏకంగా ఒకేసారి రెండు డోసులు ఇచ్చారు.
తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక విషయం ఏంటంటే..? ఆదివారం జోగిపేట రిక్షాకాలనీలో వైద్యులు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. అందరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వచ్చారు. అయితే అప్పటికే స్థానికంగా ఉంటున్న సాబేరా బేగం అనే వృద్ధురాలికి వ్యాక్సిన్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే మున్సిపల్ సిబ్బంది అక్కడి చేరుకుని వ్యాక్సినేషన్ ఫొటో కావాలని అడగటంతో ముందుగానే ఇచ్చిన సాబేరా బేగంకి ఫోటో సోకులో మరోసారి వ్యాక్సిన్ ఇచ్చారు. రెండు సార్లు ఇవ్వటమేంటి అని ఆ వృద్ధురాలు ప్రశ్నించటంతో వైద్యులు తలలు పట్టుకున్నారు. ఇక ఈ విషయంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకుని ఆ వృద్ధురాలిని అబ్జర్వేషన్‌లో ఉంచారు.