తీవ్ర గాయమై ఆసుపత్రికి వెళ్తే కుట్లు వేయాల్సింది పోయి ఫెవిక్విక్ తో చికిత్స చేశారు. ఇదేంటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఏదైనా గాయమైతే వెంటనే వెళ్ళేది ఆసుపత్రికే. గాయాన్ని బట్టి డాక్టర్ చికిత్స అనేది చేస్తారు. ముందుగా ఫస్ట్ ఎయిడ్ చేసి కట్లు కడతారు. గాయం మానడం కోసం ఇంజక్షన్ చేసి.. ఆయింట్మెంట్లు, మందులు ఇస్తారు. అయితే పెద్ద గాయమైతే కనుక కుట్లు వేస్తారు. గాయం కారణంగా చర్మం చీలిపోతే దాన్ని కుట్లు వేసి అతికిస్తారు. ఎక్కడైనా జరిగేది ఇదే. కానీ ఒక డాక్టర్ ఫెవిక్విక్ తో చర్మాన్ని అంటించేసాడు. గాయమైందని ఒక బాలుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్తే ఒక డాక్టర్ చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కుట్లకు బదులు ఫెవిక్విక్ తో అతికించాడు. ఇదెక్కడి ట్రీట్ మెంట్ అని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడు.
ఈ ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా లింగసూగూరు గ్రామానికి చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు.. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ గ్రామంలో బంధువుల పెళ్లి ఉంటే రెండు రోజుల క్రితం వచ్చారు. అయితే వీరి కుమారుడు ప్రవీణ్ పెళ్ళిలో ఆడుకుంటూ కిందపడడంతో ఎడమ కంటి పైన గాయమైంది. గాయం తీవ్రంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వెంటనే రెయిన్ బో చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. గాయం లోతుగా ఉండడంతో కుట్లు వేయాల్సి ఉంది. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం కుట్లు వేయకుండా ఫెవిక్విక్ తో చర్మాన్ని అతికించారు.
ఈ విషయం బాలుడి తండ్రికి తెలిసి ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. ఫెవిక్విక్ తో వైద్యం చేయడమేమిటని. ఇన్ఫెక్షన్ అయితే ఎవరిది బాధ్యత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన డాక్టర్ పొరపాటున చేసి ఉండవచ్చునని, మీ అబ్బాయికి ఏమీ కాదని, ఏమైనా అయితే తనది బాధ్యత అంటూ వెల్లడించారు. అయితే ఈ వ్యవహారం మీద బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
రెయిన్బో ప్రైవేట్ హాస్పిటల్లో కంటి పైన గాయానికి ఫెవి క్విక్‌తో విచిత్రమైన వైద్యం
జోగులాంబ గద్వాల – ఐజ మండలంలో బాలుడు కిందపడి గాయాలు కావడంతో కుట్లు వేయకుండా ఫెవిక్విక్ వైద్యం చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో జరిగింది. pic.twitter.com/rMk6t5Nhm9
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2023