జీవితం బుద్భుద ప్రాయం. ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరమూ చెప్పలేము. అప్పటివరకు ఆరోగ్యంగా.. నవ్వుతూ.. తుళ్లుతూ ఉన్న వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కానీ, చనిపోతామని ముందే తెలిస్తే మాత్రం.. పరిస్థితి దారుణంగా ఉంటుంది.
చావు ప్రతీ మనిషి జీవితంలోని చివరి మజిలీ. మనం ఎంత గొప్ప వాళ్లము అయినా.. ఎన్ని గొప్ప గొప్ప విజయాలను సాధించినా.. మంచి, చెడులతో ఎలాంటి సంబంధం లేకుండా అందరికీ చివరికి మిగిలేది ఆరు అడుగుల నేలే. మనం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతామని తెలుసు.. కానీ, సరిగ్గా ఎప్పుడు చనిపోతామో తెలీదు. ఒక వేళ మన చావు గురించి మనకు ముందుగానే తెలిస్తే.. దానంత నరకం ఇంకోటి ఉండదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ముందుగానే చనిపోతామని తెలిసిన రోగులు, ఉరి శిక్ష పడ్డ ఖైదీలు తీవ్రమైన మానసిక సంఘర్షణనకు గురవుతూ ఉంటారు. చావు దగ్గర పడే కొద్ది వారిలో ఒకలాంటి బాధ, భయం కలుగుతూ ఉంటాయి.
కొంతమంది ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ, అతికొద్ది మంది మాత్రమే చావును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. బతికే కొన్ని రోజులు ఎవ్వరినీ ఇబ్బందిపెట్టకుండా.. చావు తర్వాత కూడా నా అనుకునే వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో డాక్టర్ హర్షవర్థన్ ప్రవర్తించిన తీరు సినిమాను తలపిస్తోంది. తాను చనిపోతానని తెలిసినా అతడు ఏ మాత్రం అధైర్యపడలేదు. తన విషయం తెలిసి బాధపడుతున్న తన వాళ్లకు ధైర్యం చెప్పాడు. చివరి క్షణాల వరకు అదే నిబ్బరంతో ఉన్నాడు. చావును కూడా నిద్రలా ఆహ్వానించాడు.
ఖమ్మం జిల్లాకు చెందిన ఏపూరి హర్షవర్థన్ వృత్తి రీత్యా వైద్యుడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో వైద్య సేవలు అందిస్తున్నాడు. అతడికి వైరా దగ్గరలోని మేనత్తగారి ఊరికి చెందిన సింధు అనే యువతితో ఫిబ్రవరి 12, 2020లో పెళ్లయింది. పెళ్ల తర్వాత ఫిబ్రవరి 29న హర్షవర్థన్ ఒక్కడే ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఏప్రిల్ మొదటి వారంలో భార్యను తన వద్దకు తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ నేపథ్యంలోనే మార్చి 23 2020లో లాక్‌డౌన్ పడింది. దేశాలకు మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో సింధు ఆస్ట్రేలియా వెళ్లలేకపోయింది. హర్షకి పరిశుభ్రత అంటే ప్రాణం. స్వయంగా వంట చేసుకుని తినేవాడు. బాడీ ఫిట్ నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు. ప్రతిరోజు జిమ్ చేసేవాడు. అక్టోబర్ 2020లో జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేస్తుంటే ఆయాసంతో పాటు కొంచెం దగ్గు కూడా రావడం మొదలైంది. వైద్య పరీక్షలు చేయించుకోగా ఉప్పెన లాంటి విషయం ఒకటి తెలిసింది. హర్షకు లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.
హర్షకు లంగ్ క్యాన్సర్ అన్న సంగతి కుటుంబసభ్యులకు అతడి భార్యకు తెలిసింది. దీంతో వారు విలవిల్లాడిపోయారు. దాదాపు మూడు నెలల పాటు కన్నీరుమున్నీరుగా విలపించారు. పరుగున హర్ష వద్దకు వెళదామని అనుకున్నారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా వీళ్లు అక్కడికి వెళ్లలేరు.. అక్కడినుంచి హర్ష ఇండియాకు రాలేడు. నిత్యం నరకం అనుభవించసాగారు. తాను చనిపోతానని అతడికి ముందే తెలిసినా.. కుటుంబసభ్యులకు మాత్రం ఈ విషయం చెప్పలేదు.
ఏం కాదని, రోగం నయం అవుతుందని చెబుతూ వచ్చాడు. కానీ, భార్య సింధును ఓదార్చటం అతడి వల్ల కాలేదు. తాను చనిపోతే సింధు పరిస్థితి దారుణంగా తయారవుతుందని భావించాడు. విడాకులు ఇవ్వమని కోరాడు. అయితే, విడాకులు ఇవ్వటానికి సింధు అంగీకరించలేదు. లాక్‌డౌన్ ఎత్తివేయగానే ఆస్ట్రేలియాకు వచ్చి సేవలు చేస్తానని అంది. అతడు ఇందుకు ఒప్పుకోలేదు. భార్య భవిష్యత్తు గురించి ఆలోచించాడు. పెద్దలను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు. భరణంగా పెద్ద మొత్తం ఇచ్చాడు.
లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత అతడి తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వస్తామని అతడికి చాలా సార్లు చెప్పారు. ఇందుకు అతడు ఒప్పుకోలేదు. వ్యాధి కారణంగా తాను పడే కష్టాలు వారు చూసి తట్టుకోలేరని అతడు భావించాడు. మెల్ల మెల్లగా వారిని తన చావుకు సిద్ధం చేస్తూ వచ్చాడు. 2022 అక్టోబర్ నెలలో ఇండియాకు వచ్చాడు. ఖమ్మంలోని తన తల్లిదండ్రులు కుటుంసభ్యులను కలిశాడు. 15 రోజులు ఇంటి దగ్గరే ఉండి.. ఒకేరోజు తన తల్లిదండ్రులను అమెరికాలోని తన తమ్ముడి దగ్గరకు పంపాడు. తనకు ఆస్ట్రేలియాలోనే మెరుగైన వైద్యం లభిస్తుంది అని చెప్పి తను ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో 100 మందికి పైగా అనాధలు ఉన్న ఆశ్రమంలో వైద్య సేవలు అందించాడు.
మార్చి 27, 2023కు ముందుగానే హర్ష చనిపోబోతున్నట్లు వైద్యులు ఓ డెత్ డేట్‌ను ఇచ్చారు. దీంతో హర్ష తన అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందుగానే చేసుకున్నాడు. చివరి క్షణాలు రానే వచ్చాయి. మార్చి 24వ తేదీన ఉదయం బ్రౌన్ కలర్ జాకెట్.. తెల్లటి పాయింట్.. తెల్లటి షూ ధరించి చక్కగా తయారయ్యాడు. తన స్నేహితులతో కలిసి చాలాసేపు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు. కొన్ని గంటల తర్వాత మూత్ర విసర్జన కోసం వాష్ రూమ్‌కు వెళ్ళగా మూత్రం బదులు రక్తం రావడం మొదలైంది. ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పాడు.
‘‘ నేను మరొక గంట కంటే ఎక్కువ సేపు మీ ముందు ఉండలేను’’ అని అన్నాడు. రెస్ట్ తీసుకుంటా అని పడుకున్నాడు. సరిగ్గా రెండు నిమిషాల తర్వాత 32 సంవత్సరాల హర్షవర్ధన్ నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. చనిపోతూ ఓ గొప్ప జీవిత సత్యాన్ని లోకానికి చెప్పిపోయాడు. జీవితం చాలా చిన్నది.. సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి. వాటి గురించి బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం మూర్ఖత్వం. చావు తథ్యం అని తెలిసినా.. చివరి వరకు నిబ్బరంగా పోరాడిన హర్ష నిజంగా ఓ గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయినా అందరి మనసుల్లో బతికే ఉంటాడు.