రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతుంది. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం వేళ బయట అడుగు పెట్టామా.. ఇక అంతే సంగతులు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలుగు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆ వివరాలు..
రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఉదయం ఏడు గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 10 దాటింది అంటే.. ఇక పరిస్థితి గురించి చెప్పే పని లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట కాలు పెట్టాలంటేనే భయమేస్తుంది. ఇక వడగాల్పుల కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడి, వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం (మే 17న) ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కొత్తగూడెం జిల్లాలో నిన్న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూలూరుపాడులో బుధవారం 46.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా వెల్లడించారు అధికారులు.
జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 43.1 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటంతో వాతావరణ శాఖ 16 మండలాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గరిమెళ్లపాడులో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లోనూ 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రత 43.1 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటంతో జిల్లాలోని తొమ్మిది మండలాలు వార్నింగ్ జోన్‌లోకి వెళ్లాయి. 1952లో భద్రాచలంలో 48.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇదే ఇప్పటి వరకు తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతగా వాతవారణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నాం సమయంలో ప్రజలు అస్సలు బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతేనే బయటకు రావాలని.. లేదంటే.. ఇంట్లోనే ఉంటే మంచిది అంటున్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు మంచి నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, లస్సీ, సీజనల్‌గా లభించే పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా సరే.. ముదురు రంగు దుస్తులు కాకుండా లేత వర్ణం బట్టలు.. పల్చనవి ధరించాలని సూచిస్తున్నారు. అలానే బయటకు వెళ్లేవారు తలకు టోపీ, జేబు రుమాలు, అవసరమైతే గొడుగును ఉపయోగించాలని సూచిస్తున్నారు. శరీరం వేడిగా ఉన్నా.. చర్మం ఎరుపెక్కి రంగు మారినా తలనొప్పి, నీరసం, వికారంగా ఉన్నా వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లాలి అంటున్నారు వైద్యులు.