యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం తర్వాత భక్తులు రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు వేసినప్పటికి.. ఉపయోగం లేకుండా పోతుంది. ఈ క్రమంలో ఓ ప్రతిపాదనను తెర మీదకు తెస్తున్నారు భక్తులు. అదే జరిగితే.. హైదరాబాద్ టూ యాదాద్రి ప్రయాణం చాలా సులభం కానుంది. ఆ వివరాలు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుమల తరహాలో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భావించడమే కాక.. అందుకు ఏకంగా కోట్ల రూపాయలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రిని సందర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. పండుగల వేళ, సెలవు దినాల్లో భక్తులు భారీగా ఆలయానికి క్యూ కడుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ప్రత్యేక బస్సులు వేసినా.. ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో ప్రజల నుంచి ప్రభుత్వానికి ఓ డిమాండ్ వినిపిస్తోంది. ఇదే గనక ఆచరణలోకి వస్తే.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి కేవలం 45 నిమిషాల్లోనే.. అది కూడా 20 రూపాయల చార్జీతో వెళ్ల వచ్చు. మరి ఇంతకు ఆ డిమాండ్ ఏంటంటే..
యాదాద్రికి రద్దీ నేపథ్యంలో.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లను నడిపిస్తే.. బాగుంటుందని.. భక్తులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ప్రాంరభించింది. కానీ అవేవి ఆచరణలోకి రాలేదు. ఎంఎంటీఎస్ రైలును యాదాద్రి సమీపంలోని రాయగిరి స్టేషన్ వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిపాదించింది. ఇప్పటికి ఆరేళ్లు దాటినా.. ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు కదలలేదు.
ఇక ఈనెల 8న అనగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణు వస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణంతో పాటు.. తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్ విషయంపైనా దృష్టిపెట్టాలని.. దీన్ని మోదీ దగ్గర ప్రస్తావించాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ ఘట్‌కేసర్ వరకూ ఉంది. సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్ వరకు 21 కి.మీ మార్గంలో ఎంఎంటీఎస్ రెండో దశ రైల్వే లైనును అందుబాటులోకి తెచ్చారు. ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకూ మధ్య దూరం కేవలం 32 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులను పొడిగిస్తే.. భక్తులు నగరం నుంచి సులభంగా యాదాద్రి ఆలయానికి చేరుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
ఇక ఈ రైల్వే లైనుకు రూ.330 కోట్ల వ్యయం అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. తమ వాటాగా కేంద్రం రూ.110 కోట్లు సమకూర్చాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెండు వాటాల కింద రూ.220 కోట్లు భరించేందుకు అంగీకారం కుదిరింది. ఈ రైల్వే లైనుకు రూ.200 కోట్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ గతేడాది ప్రకటించారు. అయినా.. సరే నిధులు సరిగా అందకపోవడంతో.. ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఆరేళ్లు గడిచినా.. ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. ఆలస్యం అవుతున్నకొద్దీ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరుగుతుంది.
ఇక ఈ ప్రాజెక్టు గనక పట్టాలెక్కితే… హైదరాబాద్ నుంచి యాదాద్రికి కేవలం 20 రూపాయలతో అది కూడా 45 నిమిషాల్లో జర్నీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరం నుంచి రోడ్డుమార్గంలో 65 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రికి వెళ్లేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతోంది. అదే ఎంఎంటీఎస్ ట్రైన్‌లో అయితే సికింద్రాబాద్ నుంచి 45 నిమిషాల నుంచి గంటలోపు వెళ్లేందుకు వీలు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు పూర్తయితే యాదాద్రికి వెళ్లే భక్తులకు సమయంతో పాటు డబ్బు కుడా ఆదా ఆవుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని భక్తులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.