సికింద్రాబాద్ దక్కన్ మాల్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే మంటల్లో భవనం పూర్తిగా కాలిపోవడంతో దానిని కూల్చివేయాలంటూ అధికారులు, నేతలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కూల్చివేత పనులకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కూల్చివేత పనులను కూడా ప్రారంభించారు. అయితే ఈ కూల్చివేత పనులకు ముందు కాసేపు హైడ్రామా నడిచింది. మొదట ఓ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకోగా.. సాయంత్రం మరో సంస్థకు కూల్చివేత పనులు అప్పగించారు.
దక్కన్ మాల్ కూల్చివేతకు అధికారులు టెండర్ పిలిచారు. ప్రభుత్వం రూ.33.86 లక్షల అంచనా వ్యయంతో కూల్చివేత పనుల కోసం టెండర్ పిలిచింది. అయితే ఎస్.కె.మల్లు కన్ స్ట్రక్షన్స్ సంస్థ తాము కేవలం రూ.25.94 లక్షలకే పని పూర్తిచేస్తామని కాంట్రాక్ట్ సొంతం చేసుకుంది. అయితే వారి ఐడియాని అధికారులు, మంత్రి తలసాని ఒప్పుకోలేదు. వారు ఏం చెప్పారంటే భారీ క్రేన్ సాయంతో ఒక కంప్రెషర్ ని భవనం పైకి తీసుకెళ్లి.. దానిని క్రేన్ తోనే పట్టి ఉంచి.. ఒక్కో స్లాబ్ ని కూల్చుతామన్నారు. అయతే వారి చెప్పిన విధానాన్ని జీహెచ్ ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఒప్పుకోలేదు. సాయంత్రానికి వారి కాంట్రాక్టును రద్దు చేసింది.
రూ.33 లక్షలకు పని పూర్తి చేస్తామన్న మాలిక ట్రేడర్స్ కు కూల్చివేత పనులను అప్పగించారు. వారు భారీ యంత్రాలు, జేసీబీలతో కూల్చివేత పనులను ప్రారంభించారు. గురువారం రాత్రి నుంచి దక్కన్ మాల్ కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ కూల్చివేత వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తలసాని భరోసా ఇచ్చారు. దక్కన్ మాల్ గురువారం రాత్రి మళ్లీ మంటలు చెలరేగాయి అనే వార్తి ఇప్పుడు స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. గురువారం రాత్రి మరోసారి మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పేశారు. వారం తర్వాత కూడా మరోసారి దక్కన్ మాల్ లో మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.