ఢిల్లీ లిక్కర్ స్కాం… దేశవ్యాప్తంగా ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అధికారులు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును చేర్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీబీఐ.. కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ అనగా ఆదివారం ఉదయం కవితను హైదరాబాద్‌లో కానీ.. ఢిల్లీలో కాని విచారించనున్నట్లు సీబీఐ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనుల సృష్టిస్తోన్న లిక్కర్ స్కాంలో తెలంగాణ నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేయడం ఏంటి.. వీరికి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో గల సంబంధం ఏంటి వంటి పూర్తి వివరాలు..
ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీ లిక్కర్ స్కాం వివరాలు బయటకు వచ్చాయి. ఢిల్లీలో అంతకు ముందు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేది. అయితే 2021 నవంబరులో ఎక్సైజ్ పాలసీ 2021-22ను అమల్లోకి తీసుకొచ్చింది. ఫలితంగా మద్యం అమ్మకాల నుంచి ప్రభుత్వం తప్పుకుని.. ఆ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. అయితే ప్రభుత్వంలోని కొందరు ముడుపులు తీసుకొని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరేలా విధానాలను తీసుకొచ్చారనేది ఆరోపణ. ఈ విషయాన్ని 2022 జూలైలో కొత్తగా నియమితులైన ఢిల్లీ ప్రధాన కార్యదర్శి.. నరేశ్ కుమార్ వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ ఆరోపణలపై నాటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ క్రమంలో 2022 ఆగస్టు 19 మనీశ్ సిసోడియాతో పాటు పలువురు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
అదే సమయంలో.. మద్యం స్కాంలో కల్వకుంట్ల కవితకు కూడా భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈడీ నిర్వహించిన సోదాల్లో భాగంగా హైదరాబాద్‌లోను దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలంగాణకు రాబిన్ డిస్లరీ పేరుతో వ్యాపారం చేసిన రామచంద్ర పిళ్లైకి.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో లింకులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీల్లో పనిచేస్తున్న బోయినపల్లి అశోక్, బంజారాహిల్స్ వ్యాపారవేత్త వెన్నమనేని శ్రీనివాసరావుల పాత్ర ఉన్నట్లు అధికారుల గుర్తించారు. దశలవారీగా సాగిన అరెస్టుల పరంపరలో కీలక సమాచారాన్ని రాబట్టారు.
ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి బినోయి బాబును ఈడీ అరెస్టుచేసి దశలవారీ విచారణ చేపట్టింది. ఇక ఢిల్లీ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక సూత్రదారిగా వ్యవహరించారని ఈడీ తన కస్టడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ మార్కెట్‌లో 30 శాతం తన గుప్పిట్లో ఉంచుకున్నాడని.. బినామీ కంపెనీల ద్వారా.. శరత్ చంద్రారెడ్డి 9 రిటైల్ జోన్స్ పొందాడని రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ఇది మద్యం పాలసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం.
ఇక శరత్ చంద్రారెడ్డి అధ్వర్యంలోని సౌత్‌గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఢిల్లీ పెద్దలకు ముడుపులు చెల్లించారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. విజయ్ నాయర్ ద్వారా శరత్ చంద్రారెడ్డి ఈ ముడుపులు ఆప్ నేతలకు చేరవేసినట్లు గుర్తించారు. అంతేకాక శరత్ చంద్రా రెడ్డి భార్య కనికా టేక్రివాల్ నడుపుతున్న జెట్ సెట్ గో ప్రైవేట్ జెట్ చార్టర్డ్ విమానాల ద్వారా లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ముడుపులు తరలించినట్లు ఈడీ, సీబీఐ దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ కేసులో ప్రముఖ వ్యాపార వేత్త అమిత్ అరోరాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇతడు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సన్నిహితుడు.
ఇక ఈడీ అధికారులు విచారణలో అమిత్ అరోరా కవిత పేరును వెల్లడించాడు. ఇక విజయ్ నాయర్.. ఆప్ నేతలకు చెల్లించిన 100 కోట్ల రూపాయల ముడపులను సౌత్‌గ్రూప్ ద్వారా చెల్లించినట్లు ఈడీ పేర్కొంది.ఈ సౌత్‌గ్రూప్‌ను శరత్ చంద్రారెడ్డి, కవిత, మరో నేత నియంత్రించారని ఈడీ తెలిపింది.ఇక ఈ కేసులో ఈడీ అనుమానిస్తున్న వాళ్లు.. తరచూ ఫోన్లు మార్చినట్లు రిపోర్టులో వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అమిత్ అరోరా సాక్ష్యాధారాలను నాశనం చేయడం కోసం 11 సార్లు ఫోన్ మార్చడం, ధ్వంసం చేయడం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.
ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న 36 మంది.. ఒక కోటి 38 లక్షల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అలానే ఢిల్లీ మద్యం విధానం ఖరారు తేదీ దగ్గర నుంచి ఈ వివాదం వెలుగులోకి వచ్చిన ఆగస్టు వరకు అనగా దాదాపు ఏడాది కాలంలో కవిత రెండు ఫోన్ నంబర్లకు చెందిన పది ఫోన్లను మార్చడమో, ధ్వసం చేయడమో చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6న కవిత విచారణకు ఆదేశిస్తూ.. సీబీఐ నోటీసులు జారీ చేసింది.