డిగ్రీ చదువుతున్న విద్యార్థినికి ఒక దేశ ప్రధానితో కలిసే అవకాశం రావడం అంటే మాటలా? ప్రధానిని కలిసే చాన్స్‌తో పాటు ఆయన పాల్గొనే పార్లమెంట్ సెంట్రల్ హాలులో కూర్చోవడం, అదే సభలో ప్రసంగించే అవకాశం కూడా వస్తే అంతకంటే ఇంకేం కావాలి? అలాంటి అరుదైన చాన్స్ తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన శ్రీవర్షిణి అనే యువతిని వరించింది. ఎంతో అనుభవం, అపారమైన పరిజ్ఞానం, విద్యార్హతలు, నైపుణ్యం కలిగిన వారికి కూడా రాని అదృష్టం శ్రీవర్షిణికి దక్కింది. సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీవర్షిణి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మాట్లాడే అవకాశాన్ని పొందింది.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చదువుతున్న బి.శ్రీవర్షిణి.. సోమవారం (జనవరి 23న) పార్లమెంట్‌లో మాట్లాడనుంది. ఇవాళ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించనుంది. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 27 మంది విద్యార్థులను ఎంపిక చేయగా.. అందులో ఒకరిగా శ్రీవర్షిణి సెలెక్ట్ అయింది. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో నేతాజీ మీద శ్రీవర్షిణి ఇచ్చిన ప్రసంగం ఆమెకు ఈ అవకాశం దక్కేలా చేసింది. మోడీ సమక్షంలో పార్లమెంటులో మాట్లాడే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయమని శ్రీవర్షిణి చెప్పుకొచ్చింది. ఇలాంటి చాన్స్ అందరికీ రాదని.. వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవడంలోనే విద్యార్థుల ప్రతిభ ఏంటో తెలుస్తుందని ఆమె పేర్కొంది.