ఇటీవల సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాద అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు, నిపుణులు ఈ భవనాన్ని కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జనవరి 26 నుంచి అధికారులు ఈ భవనాన్ని పూర్తిగా కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో కొంత మంది కార్మికులను పెట్టి డెక్కన్ మాల్ కూల్చివేతకు పనులు ప్రారంభించారు. అయితే ఇందులో భాగంగానే ముందస్తుగా ఈ డెక్కన్ మాల్ చుట్టపక్కల ఇళ్లళ్లో నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేయించి పనులు ప్రారంభించారు.
అయితే గత ఆరు రోజులుగా జేసీబీ సాయంతో కార్మికులు ఈ భవనాన్ని కూల్చివేస్తుండగా.. మంగళవారం పేను ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ కూల్చివేతలో భాగంగా ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న ఓ జేసీబీలో కార్మికులకు పెను ప్రమాదం తప్పింది. ఇక దీంతో పాటు ఇక్కడ నివాసం ఉంటున్నవారిని ముందుగానే ఖాళీ చేయించడం ద్వారా పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలుతుండగా కొందరు వ్యక్తులు వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలు కాస్త వైరల్ గా మారాయి.