అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు.. అనేక మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త ఐడియాలతో జనాలను బురిడి కొట్టించి..వారి నుంచి సొమ్మును కొల్లగొడుతున్నారు. ప్రముఖల పేర్లను, ఫోటోలను సైతం వాడుకుని.. సామాన్యుల నుంచి అధికారుల వరకు అందరిని మోసం చేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు.. కలెక్టర్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని..డబ్బులు కావాలంటూ మెసేజ్ లు పెట్టి మోసానికి పాల్పడ్డారు. తొందరపడ్డ ఓ ప్రభుత్వ వైద్యుడు మోసపోయాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ పేరుతో వాట్సాప్ మెసేజ్‌లు పంపి..డబ్బు అవసరం ఉందని, తన అకౌంట్లో వేయాలని కోరుతూ కొందరు సైబర్ నేరగాళ్లు లింకులు పంపించారు. ఇదే సమయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న కొందరికి మొబైల్ నంబరు 72348 22110 నుంచి వాట్సప్ మెసేజ్‌లు వచ్చాయి. “నేను అత్యవసర సమావేశంలో ఉన్నా. ఫోన్ చేయలేకపోతున్నా. డబ్బులు అవసరం ఉంది. వెంటనే పంపగలరు” అని అందులో ఉంది. ఆ నెంబర్ డీపీ చూస్తే కలెక్టర్ ఫొటో ఉంది. కలెక్టర్ ఇలాంటి మెసేజ్ పంపించారేంటి అన్న అనుమానంతో సమావేశంలోనే ఉన్న కొందరు ఈ విషయాన్ని సిక్తా పట్నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
తక్షణమే ఆమె తన పేషీ ద్వారా విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.అయితే ఈలోపే ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు తొందరపడ్డాడు. రూ.10 వేల విలువైన పది అమెజాన్ కూపన్లు(మొత్తం రూ.లక్ష) అవతలి వ్యక్తి పంపారు. మరో రూ.1.5లక్షలు కావాలని అడగటంతో అనుమానం వచ్చిన డాక్టర్.. జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు అమెజాన్ కూపన్లను క్యాన్సిల్ చేయించారు. అయితే అప్పటికే మూడు కూపన్లను కేటుగాళ్లు వాడేశాడు.
మిగిలినవి క్యాన్సిల్ చేయడంతో రూ.70 వేలు డాక్టర్ కాపాడుకోకలిగాడు. సైబర్ కేటుగాళ్లు ఏకంగా కలెక్టర్ పేరుతో మోసానికి పాల్పడటంతో ఆదిలాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లకు ఎవరూ స్పందించి డబ్బులు పంపించొద్దని పోలీసుల సూచిస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.