కుమార్తె అత్తింట్లో బాగుండాలని కట్నం, సామాన్లు, వగైరా అల్లుడికి పెళ్లి సమయంలో అందిస్తారు తల్లిదండ్రులు. కానీ పెళ్లైన కొన్ని రోజుల నుండి అదనపు కట్నం తేవాలంటూ అత్తింటి నుండి వేధింపులు ఎదురౌతున్నాయి. వీటిని తట్టుకోలేక అనేక మంది మహిళలు బలౌతున్నారు. తాజాగా..
వరకట్న వేధింపులు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయి. అదనపు కట్నం తేవాలంటూ కోడలిపై భర్త, అత్త, మామ, ఆడపడుచులు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక అనేక మంది ఆడపిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుమార్తె అత్తింట్లో బాగుండాలని కట్నం, సామాన్లు, వగైరా అల్లుడికి అందిస్తారు తల్లిదండ్రులు. తమ స్థోమతకు మించి పెళ్లి చేస్తారు. కానీ పెళ్లైన కొన్నాళ్లకే అదనపు కట్నం ఇవ్వాలని, పెళ్లిలో అది పెట్టలేదని, ఇది పెట్టలేదంటూ వేధిస్తూ.. పుట్టింటి నుండి మరింత మూట తేవాలని ఇబ్బందికి గురి చేస్తుంటారు. ఆత్మాభిమానం చంపుకుని పుట్టింటి వాళ్లను అడగలేక, అత్తింటి ఆరళ్లు తట్టుకోలేక చివరకు మృత్యు ఒడికి చేరుతున్నారు. తాజాగా మరో అబల ఈ వరకట్న వేధింపులకు బలైంది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తేజస్విని కాలనీలో నివాసముంటున్న నందిని (22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రెండు సంవత్సరాల క్రితం కర్ణాటకు చెందిన సందీప్ అనే వ్యక్తితో బీదర్ ప్రాంతానికి చెందిన నందినికి వివాహం జరిగింది. సంవత్సరం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు వీరి కుటుంబం. అయితే అప్పటి నుండి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధిస్తున్నారు. భరించలేక గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని తనువు చాలించింది నందిని. సమాచారం అందుకున్న నందిని తల్లిదండ్రులు హైదరాబాద్‍కు వచ్చారు.
తమ బిడ్డను భర్త, అత్తమామలు చిత్ర హింసలు పెట్టి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ నందిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నందిని ఒంటిపై గాయాలు ఉన్నాయని.. దారుణంగా తమ బిడ్డను కొట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్నినెలలుగా అదనపు కట్నం తేవాలంటూ కుమార్తెను హింసకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ‘నీ బిడ్డ చనిపోయింది.. వచ్చి శవాన్ని తీసుకొని వెళ్లండంటూ’ నందిని భర్త సందీప్ ఫోన్ దురుసుగా చెప్పాడంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త సందీప్‌ను అరెస్టు చేయగా.. అత్తమామలు పరారీలో ఉన్నట్లు చెప్పారు.