ప్రేమ అనే రెండు అక్షరాలకు యువత బానిసలువుతున్నారు. లక్ష్యాలను వదిలేసి పెడదోవ పడుతున్నారు. ప్రేమించిన వ్యక్తి అంగీకరించలేదనో, మరో ఇతర కారణాలతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రేమ మత్తులో తల్లి, తండ్రి, స్నేహితులని కూడా చూడటం లేదు. హైదరాబాద్ లో జరిగిన నవీన్, హరి హర కృష్ణలదీ ఇటువంటి ఘటనే.. తాజాగా నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రేమ మత్తులో యువత చిత్తు అవుతున్నారు. ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి కోసం పరితపిస్తుంటారు. వారే ధ్యాస, వారే శ్వాసగా బతికేస్తుంటారు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన యువత.. ఈ ప్రేమ కారణంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయి తన ప్రపోజల్, పెళ్లికి అంగీకరించలేదని, లేదా మరొకరితో మాట్లాడుతుందని కక్ష పెంచుకుంటున్నారు. ఈ ప్రేమ ఎంతో కాలంగా స్నేహితులుగా ఉంటున్న మధ్య కూడా చిచ్చు రేపుతోంది. ఇందులో బలైన వారంతా 25 ఏళ్ల లోపు వారు కావడం గమనార్హం. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన సంఘటనే అందుకు ఉదాహరణ. ప్రియురాలి కోసం నవీన్ అనే స్నేహితుడ్ని పొట్టన పెట్టుకున్నాడు హరి హర కృష్ణ. ఈ ఘటన మర్చిపోక ముందే మరో ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రియురాలితో మాట్లాడుతున్నాడని స్నేహితుడ్ని హత్య చేయగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో జరిగింది. నందిపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా నగర్ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో సంచార కుటంబాలు ఉంటున్నాయి. ఆ కాలనీలో నివసిస్తున్న చిన్న వెంకట రమణ కుమారుడు కార్తీక్ (22), బాపట్ల రాజు (22) స్నేహితులు. కార్తీక్‌కు తండ్రి చనిపోవడంతో తల్లి, కుమారులు ఉంటున్నారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతితో ఇద్దరు ప్రేమలో పడ్డారు. రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే తాను ఇష్టపడుతున్న అమ్మాయినే కార్తీక్ ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న రాజు.. అతడిపై కక్ష కట్టాడు.
అతడిని అంతమొందించాలని పన్నాగం వేశాడు. అందుకు తమ్ముడు బొజ్జ హరీశ్ సహకరించాడు. వీరిద్దరూ కలిసి 2022 సెప్టెంబర్ 20న నందిపేట శివారులోని ఎల్లమ్మ గుడికి కార్తీక్‌ను పిలిచి మద్యం తాగించారు. పక్కనే ఉన్న ఓ గుట్ట దగ్గరకు తీసుకెళ్లి ఓ కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ గుట్ట వద్ద ఉన్న బండరాళ్ల మధ్య శవాన్ని వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం ఆ యువతిని రాజు వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని రోజులుగా కొడుకు కనిపించకపోవడంతో పనులు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కి వెళ్లి ఉంటాడని కార్తీక్ తల్లి వెంకట రమణ భావిస్తూ వస్తున్నాడు. పెద్ద కుమారుడి సాయంతో ఇరుగు పొరుగు ఆరా తీయగా.. ఎటువంటి సమాచారం లేదు.
అయితే స్థానికులు విజయనగరం గట్టు వద్ద బండరాళ్ల మధ్య ఓ శవాన్ని గుర్తించారు. కార్తీక్‌ను హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని అనుమానించి తల్లికి చెప్పారు. ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్‌లో జరిగినట్లు తమ గ్రామంలో జరిగిందని భావించిన స్థానికులు.. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా.. బండరాళ్ల మధ్య ఓ ఆస్థి పంజరం కనిపించింది. జిల్లా ఆసుప్రతి ఫోరెన్సిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ నాగమోహన్ రావు అస్థి పంజరానికి పోస్టుమార్టం నిర్వహించగా.. అది కార్తీక్ దేనని నిర్దారణ అయింది. అయితే విచారణలో నిందితుడు రాజు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని తేలింది. నిందితులిద్దరు పరారిలో ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి.. వారి కోసం గాలిస్తున్నారు.